ఇవాళే యూపీ సీఎంగా యోగి ప్రమాణ స్వీకారం
యోగి ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీతో పాటు 60 మంది వ్యాపార వేత్తలను ఆహ్వానించారు. అయితే విపక్ష నేతలు మాత్రం ప్రమాణ స్వీకారానికి హాజరు కావడం లేదు. ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, రాష్ట్రీయ లోక్‌దళ్ అధ్యక్షుడు జయంత్ చౌధరీలను ఆహ్వానించినా.. మేం రావట్లేదని వారు ఇప్పటికే చెప్పేశారు. ఇక యూపీలో కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు యోగి ఆదిత్యనాథ్‌ను తమ శాసనసభాపక్ష నేతగా నిన్న ఎన్నుకున్నారు.
బీజేపీ శాసనసభాపక్షనేత ఎన్నిక కార్యక్రమం నిన్న అమిత్ షా సమక్షంలో జరిగింది. తనదైన విధానాలతో ప్రజలను ఆకట్టుకున్న యోగి ఆదిత్యానాథ్ వరుసగా రెండోసారి అధికారం దక్కించుకుని చరిత్ర సృష్టించారు. ఉత్తర్ ప్రదేశ్‌లో అధికారం నిలబెట్టుకున్న మొట్టమొదటి బీజేపీ సీఎం కూడా యోగి ఆదిత్యానాథ్ మాత్రమే కావడం విశేషం.. గతంలో ఆయనకు ముందు మగ్గురు సీఎంలు బీజేపీ తరపున పని చేసినా వారెవరూ అధికారం నిలబెట్టుకోలేకపోయారు.
అవినీతి లేని ప్రభుత్వం, నేరగాళ్లపై ఉక్కుపాదం, ప్రజా సంక్షేమ పథకం.. వంటి విధానాలతో యోగి ఆదిత్యానాథ్ ప్రజల మనసు చూరగొన్నారని చెప్పొచ్చు.. విపక్షాల అనైక్యత, బలహీనత కూడా ఆయనకు కలిసొచ్చాయి. కాబోయే ప్రధానిగా బీజేపీలోని కొన్ని వర్గాలు చెప్పుకుంటున్న యోగి ఆదిత్యానాథ్ రెండో విడత కూడా ప్రజానురంజకంగా పాలించాలని.. అందరివాడుగా మన్ననలు తెచ్చుకోవాలని ఆశిద్దాం.