శాసన మండలి ఛైర్మన్‌కి టీడీపీ ఎమ్మెల్సీల లేఖ?

Chakravarthi Kalyan
టీడీపీ ఎమ్మెల్సీలు శాసన మండలి ఛైర్మన్‌కు లేఖ రాశారు. సారాక్షసి, జే బ్రాండ్ల నుండి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు మండ‌లిలో ప్రభుత్వం చర్చకి అంగీకరించేలా చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కోరారు. జే బ్రాండ్లలో ప్రజలు ప్రాణాలు తీసే అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నాయంటూ వచ్చిన ల్యాబ్ రిపోర్టులు లేఖకి జోడించారు టీడీపీ ఎమ్మెల్సీలు. రాష్ట్రంలో  క‌ల్తీ సారా కారణంగా   ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా జంగారెడ్డిగూడెంలోనే వారం రోజుల్లో 28 మందికి పైగా సారా తాగేవాళ్లు మృతి చెందారని.. ఏలూరు ప్రభుత్వ ఆస్ప‌త్రిలోనూ జే బ్రాండ్ ప్రమాద‌క‌ర మ‌ద్యం తాగిన వారు చికిత్స పొందుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీలు లేఖలో తెలిపారు.

గత కొన్ని నెలలుగా పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయని.. మ‌ద్యనిషేధం హామీతో అధికారంలోకి వ‌చ్చిన ప్రభుత్వమే మ‌ద్యం వ్యాపారం ఆరంభించ‌డం దారుణమని.. ఈ ఏడాది ఏకంగా సుమారు రూ.24,000 వేల కోట్ల రూపాయ‌లు మ‌ద్యంపై ఆదాయం రాబ‌డుతోందని టీడీపీ ఎమ్మెల్సీలు తమ లేఖలో తెలిపారు.  పిచ్చిమ‌ద్యం అత్యధిక ధ‌ర‌ల‌కి అమ్ముతుండ‌డంతో నిరుపేద‌లు సారాకి అల‌వాటు ప‌డి ప్రాణాలు తీసుకుంటున్నారని.. ప్రభుత్వం వాటిని స‌హ‌జ మ‌ర‌ణాలంటూ చ‌ర్చ నుంచి త‌ప్పించుకోవాల‌ని చూస్తోందని టీడీపీ ఎమ్మెల్సీలు తమ లేఖలో ఫిర్యాదు చేశారు.

సారా విక్రయ‌దారుల‌పైనా, త‌యారీదారుల‌పై ఓ వైపు కేసులు పెడుతూనే మ‌రోవైపు అస‌లు సారాయే లేద‌ని చెప్పడం స‌భ‌ని త‌ప్పుదోవ ప‌ట్టించ‌డ‌మేనని టీడీపీ ఎమ్మెల్సీలు అంటున్నారు.  ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి  సాధార‌ణ మ‌ర‌ణాలంటూ సూత్రీక‌రించ‌డంతో ప్రభుత్వంపై ప్రజ‌ల్లో అనుమానాలు బ‌ల‌ప‌డుతున్నాయని.. సారా, జే బ్రాండ్ల మ‌ద్యం మృతుల పోస్ట్ మార్టం నివేదిక‌లు వెల్లడించాల‌ని, మృతుని కుటుంబానికి 25 లక్షల చొప్పున ప‌రిహారం ఇవ్వాల‌ని, సారా, జే బ్రాండ్ల మ‌ర‌ణాల‌పై న్యాయ‌విచార‌ణ జ‌రిపించాలని టీడీపీ ఎమ్మెల్సీలు తమ లేఖలో డిమాండ్ చేశారు.

క‌ల్తీ సారా, జే బ్రాండ్ల ప్రమాద‌క‌ర మ‌ద్యంతోనే మ‌ర‌ణాలు సంభ‌వించాయ‌నే అన్ని ఆధారాలు మేము సభ ముందు ఉంచడానికి సిద్ధంగా ఉన్నామన్న టీడీపీ ఎమ్మెల్సీలు... శాస‌న‌ స‌భ‌లోనూ, శాస‌న‌మండ‌లిలోనూ సారా మ‌ర‌ణాల‌పై మేము చ‌ర్చకి ప‌ట్టుబ‌ట్టిన త‌రువాత.. ఐదు రోజుల‌పాటు స్పెష‌ల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో రాష్ట్రవ్యాప్తంగా జ‌రిపిన దాడుల్లో సారా విక్రయం, త‌యారీపై 1129 కేసులు న‌మోదు చేసి 677 మంది నిందితులని అరెస్టు చేశారని టీడీపీ ఎమ్మెల్సీలు తమ లేఖలో తెలిపారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: