నెల్లూరు జిల్లాపై పవన్ స్పెషల్ ఫోకస్.. ఎందుకో తెలుసా..?
ప్రస్తుతం నెల్లూరు జిల్లాపై పవన్ కల్యాణ్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. గతంలో చిరంజీవి కుటుంబం నెల్లూరులో కూడా కొంతకాలం ఉంది. ఆ సమయంలో పవన్ కు కూడా స్థానికంగా పరిచయాలున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎలాగూ పొత్తులు ఉంటాయనే వార్తలొస్తున్నాయి. దీంతో ముందుగానే నెల్లూరుపై ఫోకస్ పెట్టి అక్కడ బలమైన అభ్యర్థుల్ని ఖరారు చేయడానికి పవన్ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.
మనుక్రాంత్ రెడ్డి బోణీ కొడతారా..?
నెల్లూరు జిల్లాలో పార్టీ వ్యవహారాలను చూస్తున్న మనుక్రాంత్ రెడ్డి వచ్చే దఫా కచ్చితంగా జనసేన జెండా ఎగరేస్తానంటున్నారు. ఇప్పటికే మనుక్రాంత్ దీనికి సంబంధించి ఓ టీమ్ రెడీ చేసుకున్నారు. కిషోర్, సుజిత్ వంటి కీలక నేతల ఆధ్వర్యంలో నెల్లూరు పరిసర ప్రాంతాల్లో జనసేన కార్యకర్తలను ఏకం చేస్తున్నారు. క్రియాశీలక సభ్యత్వాల విషయంలో కూడా నెల్లూరు జిల్లా చురుగ్గా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతంత నెల్లూరు జిల్లాలో అన్ని స్థానాల్లో వైసీపీ ఎమ్మెల్యేలున్నారు. టీడీపీ పెద్దగా బలం పుంజుకుంది కూడా లేదు. నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన కలిస్తే చాలా వరకు వైసీపీకి గట్టిపోటీ ఇచ్చే అవకాశముంది. ప్రస్తుతం అక్కడ అదే జరుగుతోంది. పొత్తు ఈక్వేషన్లలో ఆ రెండిట్లో ఓ సీటు జనసేనకు వస్తే మాత్రం గెలుపు గ్యారెంటీ అని ధీమా వ్యక్తం చేస్తున్నాయి పార్టీ శ్రేణులు. రాష్ట్రంలో చాలా చోట్ల టికెట్లు కన్ఫామ్ అనుకున్న జనసేన నాయకులు చాపకింద నీరులా తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. పార్టీని బలోపేతం చేస్తూ, మద్దతుదారుల్ని పెంచుకుంటున్నారు. నెల్లూరులో మనుక్రాంత్ వ్యూహం ఫలిస్తే జనసేన బోణీ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.