ఆ వైసీపీ ఎమ్మెల్యేపై అసంతృప్తి.. ఏకమైన నాయకులు?
ఇంతకీ ఆ వైసీపీ ఎమ్మెల్యే ఎవరనే కదా మీ సందేహం.. ఆ ఎమ్మెల్యేనే.. తాడికొండ శాసన సభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి. ఆమెకు వ్యతిరేకంగా వైసీపీ నేతలంతా సమావేశం పెట్టుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. గుంటూరు నగరంలోని ఓ హాల్ లో తాడికొండ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసుకున్నారట. ఎమ్మెల్యే శ్రీదేవి ఏకపక్ష నిర్ణయాలు పార్టీ నాయకులకు ఇబ్బంది కలిగిస్తున్నాయని వారు ముక్త కంఠంతో అంటున్నారు.
ఎమ్మెల్యే వద్ద ఉన్న కొందరు వ్యక్తులు ప్రతి పనికీ లంచాలు అడుగుతున్నారట. ప్రతి విషయంలోనూ డబ్బు చూపకపోతే పని కావడం లేదట. అంతే కాదు.. ఉండవల్లి శ్రీదేవి కారణంగా పార్టీలో కష్టపడిన వారికి సరైన గుర్తింపు దక్కడం లేదట. మండల పదవుల్లో తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఏక పక్ష నిర్ణయం తీసుకుని వారందరినీ బాధించిందట. తొమ్మిది సంవత్సరాలుగా పార్టీకి తోడుగా ఉన్న నాయకులను తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అణగదొక్కుతోందట.
తాడికొండ పరిధిలో ఒక్కమాటలో చెప్పాలంటే నియంత పాలన సాగుతోందని వైసీపీ నాయకులు కొందరు భోరున విలపిస్తున్నారు. మరి వీరి ఆవేదనలో ఎంత వరకూ వాస్తవం ఉందనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఏదేమైనా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పై ఇలా వ్యతిరేకత వ్యక్తం కావడం ఇదే తొలిసారి కూడా కాదు. గతంలోనూ ఇలాంటి వార్తలు వచ్చాయి. మరి ఈ మీటింగ్ గురించి ఆమె ఎలా స్పందిస్తారో చూడాలి.