అమరావతి : చంద్రబాబు దారిలోనే జగనూ నడుస్తున్నారా ?
అధికారంలో ఉన్నపుడు ఎవరైనా ఒకేలాగ వ్యవహరిస్తారా ? జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబునాయుడును ఉదాహరణగా తీసుకుంటే అవుననే అనిపిస్తోంది. జగన్ అధికారంలోకి వచ్చి మూడుళ్ళయినా ఇప్పటివరకు పార్టీ నేతలతో సమావేశమయ్యిందిలేదు. మంత్రులు, ఎంఎల్ఏలకే జగన్ అపాయిట్మెంట్ దొరకటం లేదు ఇక నేతలతో ఏమి మాట్లాడుతారనే టాక్ వినబడుతోంది. ప్రభుత్వంలో మంత్రులు ఎంతో పార్టీకి నేతలంతే అన్న విషయాన్ని జగన్ మరచిపోయినట్లున్నారు.
ప్రతిపక్షంలో ఉన్నపుడు పార్టీ నేతలతో సమావేశాలైనట్లు అధికారంలో ఉన్నపుడు సాధ్యంకాదని అందరికీ తెలిసిందే. కానీ అలాగని మొదటికే మోసం ఉండకూడదకదా. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఇటు మంత్రులు, ప్రజా ప్రతినిధులతోను అటు పార్టీ నేతలతోనూ సమావేశమయ్యేవారు. వైఎస్సార్ కు సాధ్యమైంది జగన్ కు ఎందుకు కాదు ? రోజువారి ప్లానింగ్ సరిగా లేకపోవటమే కారణం. రోజులో కనీసం గంటసేపు కూడా పార్టీ నేతలకు సమయం కేటాయించలేరా ? మొన్నటికి మొన్న పార్టీ ఆధిర్భావం దినోత్సవంలో కూడా పాల్గొనలేదు.
ఇపుడు జరుగుతున్నది చూస్తుంటే ఒకపుడు చంద్రబాబునాయుడు చేసిన తప్పే జగన్ కూడా చేస్తున్నట్లు అర్ధమవుతోంది. అధికారంలో ఉన్నపుడు చంద్రబాబు కూడా పార్టీ నేతలకు సమయం ఇచ్చేవారు కాదు. ఏమంటే తాను బిజీగా ఉన్నట్లు బిల్డప్ ఇచ్చేవారు. అదే ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నపుడు తాను తప్పుచేశానని చెబుతుంటారు. ఇకనుండి పార్టీ నేతలతో కూడా రెగ్యులర్ గా సమావేశం అవుతుంటానని మొక్కుబడి ప్రకటనలు చేస్తారు. ఇపుడు జగన్ కూడా తొందరలోనే ప్రజాప్రతినిధులు, నేతలతో సమావేశమవుతానని చెబుతున్నారు.
ఇపుడు జగన్ వ్యవహారం కూడా చంద్రబాబు వ్యవహారం లాగే అనిపిస్తోంది. చంద్రబాబు చేసిన తప్పే జగన్ కూడా చేస్తున్నట్లు అర్ధమైపోతోంది. షెడ్యూల్ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ళు మాత్రమే ఉంది. కాబట్టి జగన్ వెంటనే పార్టీ నేతలతో సమావేశాలు మొదలుపెట్టాలి. క్షేత్రస్ధాయిలో జరుగుతున్నదేమిటో వారినుండి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి. రేపటి ఎన్నికల్లో పార్టీ మళ్ళీ గెలవాలంటే పనిచేయాల్సింది నేతలు, కార్యకర్తలే అన్న సత్యాన్ని జగన్ గుర్తుంచుకోవాలి. లేకపోతే ప్రతిపక్షంలో కూర్చుని ఇపుడు చంద్రబాబు చెబుతున్న డైలాగులే జగన్ కూడా చెప్పుకోవాల్సుంటుంది.