కేసీఆర్ కి గవర్నర్ షాకిస్తారా.. అసెంబ్లీ స్పీకర్ పై చర్యలు తీసుకుంటారా..?
తెలంగాణ అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్ రావులను… స్పీకర్ సస్పెండ్ చేశారు. బడ్జెట్ ప్రసంగానికి బీజేపీ ఎమ్మెల్యేలు అడ్డు తగులుతున్నారంటూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీర్మానం ప్రవేశపెట్టగా.. దానిపై స్పీకర్ చర్య తీసుకున్నారు. ఆ తీర్మానాన్ని ఆమోదించిన స్పీకర్ పోచారం.. ముగ్గురు సభ్యులపై సస్పెన్షన్ వేటు వేశారు. బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ వ్యవహారం తెలంగాణలో మరింత రాజకీయ కలకలం రేపింది.
ఈ వ్యవహారంపై బీజేపీ ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలను చూసి కేసీఆర్ భయపడిపోతున్నారని అన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు గవర్నర్ తమిళి సై కి స్పీకర్ పోచారంపై ఫిర్యాదు చేశారు. రాష్ట్ర శాసనసభలో జరిగిన ఘటనపై గవర్నర్ కి ఫిర్యాదు చేశామని వారు మీడియాకు తెలుయజేశారు. బడ్జెట్ సమావేశాల ప్రసంగానికి గవర్నర్ ను పిలవక పోవడం రాజ్యాంగ విరుద్ధం అని చెప్పామన్నారు. అసెంబ్లీలో తామంతా మూడో వరుసలో నిలబడి ఉన్నామని, మొదటి వరుసలోని కాంగ్రెస్ నేతల్ని తప్పించుకుని తమపై వేటు వేయడమేంటని ప్రశ్నించారు బీజేపీ ఎమ్మెల్యేలు. స్పీకర్ పై చర్య తీసుకోవాలని గవర్నర్ ని కోరినట్టు తెలిపారు. స్పీకర్ పై గవర్నర్ ఎలాంటి చర్య తీసుకుంటారు, అసలు చర్య తీసుకోడానికి గవర్నర్ కి ఎలాంటి అధికాకారాలుంటాయి, నిజంగానే ఈ విషయాన్ని మరింత పెద్దది చేస్తారా లేక వదిలేస్తారా అనేది తేలాల్సి ఉంది.