ప్రధాని హైలెవల్ మీటింగ్ అందుకేనా..!

NAGARJUNA NAKKA
ప్రధాని మోడీ ఢిల్లీలో ఉన్నత స్థాయి భేటీలో పాల్గొన్నారు. గత 24గంటల్లో ప్రధాని మోడీ మూడో సమావేశం నిర్వహించగా.. ఉక్రెయిన్ లో పరిస్థితులు వేగంగా మారుతున్న సమయంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఉక్రెయిన్ నుంచి ప్రత్యేక విమానాల ద్వారా భారతీయులను కేంద్రం ఇప్పటికే తరలిస్తుండగా.. ఈ సమావేశంలో తరలింపును వేగవంతం చేయడంపై నిర్ణయాలు తీసుకున్నారు.

ఇక ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపునకు ఇబ్బందులు తప్పడం లేదు. హంగరీ-ఉక్రెయిన్ బోర్డర్ కు భారీగా ప్రజలు చేరుకుంటున్నారు. దీంతో భారతీయుల తరలింపునకు ఆటంకాలు తలెత్తుతున్నాయి. సరిహద్దుల్లో రద్దీ పెరగడంతో దౌత్య సిబ్బంది సైతం చేతులెత్తేశారు. వేరే బోర్డర్ కు వెళ్లాలని భారతీయ విద్యార్థులకు సూచిస్తున్నారు. గంటల తరబడి ప్రయాణం చేసిన విద్యార్థులు.. వేరే బోర్డర్ కు వెళ్లలేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు ఉక్రెయిన్ ఖార్కివ్ బంకర్లలో తలదాచుకున్న హైదరాబాద్ ఎంబీబీఎస్ ఫైనల్ విద్యార్థిని కల్పన అక్కడి ఇబ్బందులను చెబుతూ ఓ వీడియో పంపింది. ఇంకా ఐదు వేల మంది భారత విద్యార్థులు బంకర్లలోనే ఉన్నారు. ఆహారం, వాష్ రూమ్స్ లేవు.. ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీల్లో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. భారత ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి కమ్యూనికేషన్ లేదంటున్నారు. సరిహద్దు 1400 కిలోమీటర్ల దూరం ఉందంటున్నారు. ఎలా వెళ్లాలని వాపోతున్నారు.

అటు భారత విద్యార్థులు పశ్చిమ ప్రాంతానికి చేరుకోవాలని.. ఇందుకోసం ఉక్రెయిన్ ప్రభుత్వం స్పెషల్ ట్రైన్స్ ఏర్పాటు చేసిందని.. అక్కడి భారత ఎంబసీ ప్రకటించింది. అయితే 16వేల మంది భారత విద్యార్థులు ఇప్పటికీ ఉక్రెయిన్ లోనే ఉన్నారు.

ఇక రష్యా దాడులను సమర్థవంతంగా ఎదుర్కోవడం కోసం ఉక్రెయిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రష్యా సేనలకు వ్యతిరేకంగా పోరాడటం కోసం ప్రజలకు ఆయుధాలను అందజేసిన ఉక్రెయిన్.. తాజాగా సైనిక నేపథ్యం ఉండి జైలులో శిక్ష అనుభవిస్తోన్న వారిని విడుదల చేస్తోంది. వీరంతా రష్యాపై ఉక్రెయిన్ పోరాటంలో భాగస్వాములు కానున్నారు. ఈ విషయాన్ని నేషనల్ ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయం ధ్రువీకరించింది.







 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: