అమరావతి : టీడీపీకి వంగవీటి భలే షాకిచ్చారే ?

Vijaya


తెలుగుదేశంపార్టీకి వంగవీటి రాధాకృష్ణ పెద్ద షాకేఇచ్చారు.  జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జిల్లాల పునర్విభజన చేసిన విషయం తెలిసిందే. 13 జిల్లాల సంఖ్యను 26కి పెంచాలని జగన్ డిసైడ్ అయ్యారు. ఉగాధి పండగ నుండి పెంచిన జిల్లాలు అమల్లోకి రాబోతున్నాయి. ఇందులో భాగంగానే కృష్ణ జిల్లాను రెండుగా చేశారు. మచిలీపట్నం కేంద్రంగా కృష్ణా జిల్లా అలాగే ఉంటుంది.



విజయవాడ కేంద్రంగా ఏర్పడిన కొత్త జిల్లాకు ఎన్టీయార్ పేరు పెట్టారు. మొదట్లో ఈ విషయాన్ని స్వాగతించిన టీడీపీ తర్వాత రూటుమార్చింది. విజయవాడ జిల్లాకు ఎన్టీయార్ పేరు కాకుండా వంగవీటి రంగా పేరు పెట్టాలని డిమాండ్లు మొదలుపెట్టింది. పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ ఇదే విషయమై దీక్ష చేస్తానంటు పెద్ద హడావుడే చేశారు. రంగా పేరుచెప్పి కాపులను వైసీపీకి దూరం చేయాలని టీడీపీ పెద్ద ప్లానే వేసింది. ఇక్కడే కందుకు లేని దురద కత్తిపీటకు ఎందుకనే కామెంట్లు కూడా వినిపించాయి.



అయితే టీడీపీకి ఊహించని రీతిలో వంగవీటి రంగా వారసుడు వంగవీటి రాధాకృష్ణ షాకిచ్చారు. విజయవాడ జిల్లాకు తన తండ్రి రంగా పేరు పెట్టాలని తాను అడగనని స్పష్టంగా చెప్పేశారు. రంగా పేరు చెప్పుకుని పదవులు అనుభవిస్తున్న వారికే తన తండ్రి పేరు పెట్టాలని ఉండాలన్నారు. సరే ఇది ఎలాగు సాధ్యంకాదని తేలిపోయింది. ప్రభుత్వం ఎన్టీయార్ పేరును మార్చదు. కొడుకు వంగవీటి రాధా కనీసం అడగటానికి కూడా ఇష్టపడటంలేదు. మరిపుడు టీడీపీ ఏమి చేస్తుంది ?



నిజానికి తన తండ్రి రంగా పేరు పెట్టమని రాధా అడిగినా అర్ధముంది. అంతేకానీ రంగాతో సంబంధంలేని బోండా లాంటి వాళ్ళు హడావుడి ఎందుకు చేసినట్లు ? ఎందుకంటే ఇంతకుముందే చెప్పుకున్నట్లు కాపులను వైసీపీకి దూరం చేయటం కోసమే. వారసుడు రాధా తాజా ప్రకటన తర్వాత టీడీపీ నేతలు ఏమంటారనే విషయం ఆసక్తిగా మారింది. కొసమెరుపు ఏమిటంటే రాధా కూడా టీడీపీ నేత కావటమే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: