'సాక్షి' అనుమతులు రద్దు: ఆంధ్రజ్యోతి షాకింగ్ కథనం.. నిజమా?
ఇలా జరగడానికి జగన్ పై ఉన్న సీబీఐ, ఈడీ కేసులే కారణం కావచ్చని ఆంధ్రజ్యోతి మీడియా ఊహిస్తోంది. ఇలా గతంలో చానల్ ఖాతాలు ఫ్రీజ్ అయ్యాయని గుర్తు చేస్తోంది. సాక్షి టీవీ ఏపీ ముఖ్యమంత్రి జగన్ సొంత టీవీ చానల్ అన్న సంగతి తెలిసిందే. సాక్షి’కి కేంద్ర సమాచార, ప్రసార శాఖ షాక్ ఇచ్చిందని ఆంధ్రజ్యోతి మీడియాలో వస్తున్న కథనం ఇప్పుడు సంచలనంగా మారింది. సాక్షి’ టీవీకి జారీ చేసిన అనుమతిని రద్దు చేశామని... దేశంలో అనుమతించిన చానళ్ల జాబితా నుంచి తొలగించామని.. గత నెల 20వ తేదీన కేంద్ర సమాచార, ప్రసార శాఖ ఆదేశాలు జారీ చేసిందట.
సాక్షి’ టీవీకి కేంద్ర హోం శాఖ సెక్యూరిటీ క్లియరెన్స్ ఇవ్వలేదని.. అందువల్లే ఈ పరిణామం చోటుచేసుకుందని చెబుతున్నారు. దేశ అంతర్గత భద్రతను దృష్ట్యా కొన్ని ప్రమాణాలకు లోబడే చానళ్లకు కేంద్ర హోంశాఖ సెక్యూరిటీ క్లియరెన్స్ ఇస్తుందని.. అది ఉంటేనే సమాచార, ప్రసార శాఖ అనుమతి లభిస్తుందని ఆంధ్రజ్యోతి మీడియా చెబుతోంది.
అయితే సాక్షి టీవీకి హోం శాఖ సెక్యూరిటీ క్లియరెన్స్ రాకపోవడానికి కారణాలు మాత్రం ఆ కథనంలో స్పష్టంగా వెల్లడించలేదు. సాక్షి చానల్ నుంచి అంతర్గత భద్రతకు ముప్పు ఉందని కేంద్రం భావించిందా అని తనకు తానే ప్రశ్నించింది. జగన్‌పై అక్రమాస్తుల కేసులు కూడా కారణం కావచ్చేమో అని కూడా ఆ కథనం ఊహించింది. ఏదేమైనా సాక్షి టీవీ అనుమతుల రద్దు మాత్రం వాస్తవమని ఈ కథనం చెబుతోంది.