అలీలో ఉన్నదేంటి..? పవన్ లో లేనిదేంటి..?

Deekshitha Reddy
అన్నీ అనుకున్నట్టు జరిగితే హాస్య నటుడు అలీ.. రాజ్యసభ సభ్యులు అవుతారు. దీనిపై రేపోమాపో అధికారిక ప్రకటన వెలువడుతుంది అంటున్నారు. తాజాగా సీఎం జగన్ ని కలిసిన అలీ త్వరలో ప్రభుత్వ పెద్దలే ప్రకటిస్తారన్నారు, సంతోషంగా ఇంటికెళ్లారు. అలీ నేరుగా రాజకీయాల్లో లేరు. 2019 ఎన్నికల సమయంలో వైసీపీలో చేరారు, ఆ పార్టీ తరపున ప్రచారం చేపట్టారు. నేరుగా ఎక్కడా రాజకీయాల్లో ఆయన ప్రతిభ నిరూపించుకోలేదు, అలాంటి అవకాశం కూడా ఆయనకు రాలేదు. కానీ అనుకోకుండా అందలమెక్కే ఛాన్స్ మాత్రం దక్కించుకున్నారు. అదృష్టం అనుకోండి, జగన్ పట్ల విధేయత అనుకోండి, పోనీ మైనార్టీ అనే అంశం కలిసొచ్చిందనుకోండి.. కారణం ఏదయినా అలీకి బంపర్ ఆఫర్ మాత్రం దక్కింది.

పవన్ సంగతేంటి..?
పవన్ కల్యాణ్ పార్టీ పెట్టి ఏళ్లు గడిచిపోతున్నాయి. ఎప్పుడూ నేరుగా ఏ పదవినీ ఆయన కోరుకోలేదు, ఆ అవకాశం కూడా రాలేదు. 2014లో ఆయన టీడీపీ, బీజేపీ తరపున ప్రచారం చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది, ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. అప్పట్లో ఆయనకు చాలానే ఆఫర్లు వచ్చాయంటున్నారు కానీ, ఏదీ తీసుకోలేదని చెబుతారు. నిజంగానే ఆఫర్లు వచ్చాయా రాలేదా అనేది మాత్రం తెలియదు. పోనీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అంటే.. చెప్పడం కష్టం. ప్రస్తుతానికి పవన్ బీజేపీతో పొత్తులో ఉన్నా ఆయనకు పెద్ద ఉపయోగమేమీ లేదు. ప్రతి ఎన్నికల్లోనూ పవనే త్యాగం చేయాల్సి వస్తోంది. కేవలం బీజేపీ మిత్రపక్షంగా మాత్రమే జనసేన కొనసాగుతోంది.

పవన్ ఏం సాధించారు..?
పవన్ ఎప్పుడూ పదవుల విషయంలో ఎవర్నీ ఏమీ అడగలేదని, అందుకే ఆయనకు పదవులు రాలేదని అంటారు జనసైనికులు. ప్రశ్నించడానికే పార్టీ పెట్టానంటున్న పవన్, ఇప్పటికీ ఇంకా ప్రశ్నిస్తూనే ఉన్నారు. పవన్ పరోక్షంగా పదువుల తెచ్చుకోలేదు, అలాగని ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లోనూ గెలవలేదు. పవన్ ఎన్నికల్లో గెలవకపోయినా ప్రజల మనసులు గెలిచారని అంటారు జనసైనికులు. కానీ పవన్ ని ఏదో ఒక హోదాలో చూడాలనేది వారి కల. పవన్ ఒకప్పటి స్నేహితుడు అలీ ఇప్పుడు జాక్ పాట్ కొట్టారు. అనుకోకుండా అందలమెక్కుతున్నారు. మరి పవన్ కి ఎప్పుడు ఆ అవకాశం వస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: