జీవీఎల్ Vsవిజయసాయి.. భలే రంజుగా వార్..?
ప్రత్యేక హోదా అంశం ఇప్పుడు బీజేపీ, వైసీపీ ఎంపీల మధ్య మాటల యుద్ధానికి దారి తీస్తోంది. ఏపీలో నిధుల కోసం చట్టసభల్లో నేనే ప్రస్తావించానని ఇప్పుడు బీజేపీ ఎంపీ జీవీఎల్ చెప్పుకుంటున్నారు. వైకాపా ఎంపీలు చేయాల్సిన పని నేనే చేస్తున్నానని... వైసీపీ ఎంపీలు మాత్రం కేంద్ర పథకాలకు స్టిక్కర్లు వేసుకుని ప్రచారం చేస్తున్నారని జీవీఎల్ విమర్శిస్తున్నారు. మీ కృషి ఎక్కడైనా ఉందా అని వైకాపా ఎంపీలను ప్రశ్నిస్తున్నానని జీవీఎల్ వైసీపీ ఎంపీలను నిలదీస్తున్నారు.
బడ్జెట్లో రాష్ట్ర ప్రస్తావన లేదని వైసీపీ అసత్యాలు ప్రచారం చేస్తోందని.. ఏమీ చేయకుండానే ప్రాజెక్టులు, రహదారులు వచ్చాయా అని ప్రశ్నిస్తున్నారు. వైసీపీ ఎంపీలు కనీసం కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ తెచ్చుకోలేదని ఎగతాళి చేసిన జీవీఎల్.. సరైన ఆదాయ వనరులు లేని రాష్ట్రానికి హోదా ఇవ్వాలని... ఏపీకి కేంద్రం అంతకుమించి ప్యాకేజీ రూపంలో నిధులు ఇచ్చిందని చెబుతున్నారు. అన్నీ తెలిసి కూడా జగన్ ప్రత్యేక హోదా అంశాన్ని ఎత్తుకున్నారని.. ఈ అంశంపై తాను కేంద్ర హోంశాఖ సెక్రటరీ అజయ్ కుమార్ భల్లాకి లేఖ రాశానని తెలిపారు.
ఈ అంశంపై వైసీపీ ఎంపీలు కూడా ఘాటుగానే స్పందిస్తున్నారు. ఎంపీ జీవీఎల్ వ్యాఖ్యలపై మండిపడిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.. అయ్యా.. అబద్ధాల నరసింహా అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. మేము 22 ఎంపీ సీట్లు గెలిచినందుకే ఏపీకి న్యాయం చేయట్లేదా అని ప్రశ్నించారు. మీకు 301 సీట్లు వచ్చినందుకు ఏపీకి న్యాయం చేయట్లేదా?.. అసలు విషయం ఏంటో చెప్పాలన్నారు. రాష్ట్రం కోసం మేం అడగనిది ఏదీ లేదని.. మీరు ఏం ఇచ్చారో చెప్పండి చాలు అంటూ చురకలు వేశారు విజయసాయి రెడ్డి.
అటు టీడీపీ ఎంపీలు మాత్రం ఈ విషయంలో వైసీపీని టార్గెట్ చేస్తున్నారు. ప్రత్యేక హోదాపై వైసీపీ నోరు మెదపడం లేదని.. హోదాపై చర్చ ఉంటుందని.. పార్లమెంటు నుంచి నోట్ వస్తే డప్పు కొట్టుకుని చెప్పారని.. ఇప్పుడు మాత్రం నోరు మూసుకున్నారని ఎంపీ రామ్మోహన్ వ్యాఖ్యానించారు.