ఉక్రెయిన్‌పై యుద్ధానికి రష్యా మాస్టర్‌ ప్లాన్ ఇదేనా..?

Chakravarthi Kalyan
ఉక్రెయిన్ దేశంపై రష్యా యుద్ధం తప్పదని తేలిపోయింది.. మరో రెండు రోజుల్లో రష్యా యుద్ధం ప్రారంభించవచ్చని ఏకంగా అమెరికా నిఘా వర్గాలే తేల్చి చెప్పాయి. ఇప్పుడు రష్యా కదలికలు కూడా ఈ వాదనకు మరింత బలాన్నిస్తున్నాయి. ఉక్రెయిన్ చుట్టూ మూడు ప్రాంతాల గుండా ఆక్రమణ చేసేందుకు రష్యా సన్నాహాలు చేస్తున్నట్టు ఉపగ్రహ చిత్రాల్లో తేలింది. ఈ పరిణామాలు చూస్తుంటే.. ఒకటి, రెండు రోజుల్లో రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.


తాజా ఉపగ్రహ చిత్రాల ప్రకారం.. ఉక్రెయిన్‌ పై దాడికి రష్యా మూడు వైపుల నుంచి ప్రయత్నాలు చేస్తోందట. ఈ దిశగా తన సైన్యాన్ని మోహరిస్తోందట. ముఖ్యంగా క్రిమియా, బెలారస్‌, తూర్పు ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో రష్యా యుద్ధ ట్యాంకులు, శతఘ్ని, క్షిపణి దళాలను మోహరించినట్టు ఉపగ్రహ చిత్రాలు చెబుతున్నాయి. రష్యా ప్రధానంగా ఉక్రెయిన్‌లోని దొనెస్క్‌, లుహాన్స్క్‌ ప్రాంతాలపై బాగా దృష్టి పెట్టిందట. ఇందుకు ఓ కారణం ఉంది.. ఇక్కడ ఉక్రెయిన్‌ దళాలకు, రష్యా మద్దతున్న వేర్పాటువాదులకు మధ్య ఏడేళ్ల నుంచి పోరాటం సాగుతూనే ఉంది.


అందువల్ల ఈ ప్రాంతంలో చొరబాటు సులభం అని  రష్యా భావిస్తోంది. తమ సైన్యానికి ఉక్రెయిన్ వేర్పాటు దళాలు కూడా మద్దతు ఇస్తాయని రష్యా భావిస్తోంది. అందుకే రష్యా యుద్ధం ప్రారంభిస్తే అది ఈ ప్రాంతం నుంచే అని యుద్ధ నిపుణులు చెబుతున్నారు. ఇక రష్యా తన యెల్న్యా   సైనిక స్థావరంలోని ట్యాంకులు, శకటాలు, శతఘ్నులు, బాలిస్టిక్‌ క్షిపణి లాంచర్లలను ఇప్పటికే ఉక్రెయిన్ సరిహద్దులకు తరలించిందట. ఇప్పుడు ఈ శిబిరం ఖాలీగా ఉన్న చిత్రాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.


అలాగే ఉక్రెయిన్‌కు సరిహద్దుల్లోని కర్స్క్‌, బెల్గోరాడ్‌ ఓబ్లాస్ట్స్‌ ప్రాంతాల్లోనూ రష్యా సైన్యం కదలికలు పెరిగాయి. రష్యా రాజధాని ప్రాంతంలో ఉండే ఫస్ట్‌ గార్డ్స్‌ ట్యాంక్‌ ఆర్మీ  కూడా ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ను ఆక్రమించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. రష్యా తన అనుకూల దేశమైన బెలారస్‌ ను కూడా ఉక్రెయిన్‌ పై దాడికి ఉపయోగించుకోవచ్చన్న ఉహాగానాలు కూడా ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: