ఆడబిడ్డలకు సమానహక్కులట..!
దళితుల కోసమే కొత్త రాజ్యాంగం రావాలని తాను కోరుకుంటున్నట్టు సీఎం కేసీఆర్ చెప్పారు. దళితుల రిజర్వేషన్లు 19శాతం పెంచేందుకు, బీసీల కులగణన కోసం, దేశమంతా దళితబంధు పెట్టడం కోసం కొత్త రాజ్యాంగం కావాలంటున్నానన్నారు. దేశం బాగుపడాలంటే.. అందరికీ సమాన హక్కుల కోసం రాజ్యాంగం మారాలన్నారు. 77శాతం దేశ సంపద 90శాతం మంది దగ్గర ఉండాలంటే కొత్త రాజ్యాంగం కోరుకుంటున్నట్టు చెప్పారు. ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కుల కోసం కొత్త రాజ్యాంగం రాయాలని అని కేసీఆర్ అన్నారు.
అంతేకాదు బీజేపీ విద్వేషపూరిత మత రాజకీయాల గురించి యువత ఆలోచించాలని సీఎం కేసీఆర్ సూచించారు. దేశ యువత మధ్య ఎందుకు విద్వేషాలు రగులుస్తున్నారని ప్రశ్నించారు. శాంతిభద్రతలు కోరుకుందామా.. ఘర్షణలు కోరుకుందామా అనేది యువత ఆలోచించుకోవాలన్నారు. శాంతి లేని చోట పెట్టుబడులు ఎవరు పెడతారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ పట్ల దారుణంగా మాట్లాడిన అసోం సీఎంను బీజేపీ ప్రోత్సహిస్తుందా అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజలంతా అవసరమని కోరుకుంటే దేశంలో కొత్త పార్టీ పెడతామని సీఎం కేసీఆర్ చెప్పారు. కొత్త పార్టీ ఎందుకు పెట్టకూడదు. పెడితే తప్పా అని ప్రశ్నించారు. దేశంలో కొత్త పార్టీ పెట్టే దమ్ము తనకు లేదా... అని చెప్పిన కేసీఆర్.. ప్రజాస్వామ్యంలో ప్రజలు అనుకుంటే ఏమైనా జరగవచ్చని అన్నారు. తాను పుట్టగానే సీఎం అవుతానని తన తల్లిదండ్రులు కలగన్నారా.. అన్న కేసీఆర్.. ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తుంటే అవకాశాలు అవే వస్తాయన్నారు.