అమరావతి : సీతయ్యగా ఉంటారా ? జననేతగా ఉంటారా ?
అదేదో సినిమాలో ‘సీతయ్య ఎవరి మాటా వినడు’ అనే డైలాగు చాలా పాపులర్. సీతయ్యగా ఉండాలా ? జననేతగా ఉండాలా అనేది తేల్చుకోవాల్సిన సమయం జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. సీతయ్యగా కాకుండా మెజారిటి జనాల మాట వింటేనే జగన్మోహన్ రెడ్డికి మంచిది. ప్రిస్టేజికి పోతే నష్టపోయేది తానే అన్న విషయాన్ని జగన్ గ్రహించాలి. ఇంతకీ విషయం ఏమిటంటే కొత్త జిల్లాల పేర్లు, జిల్లాల నియోజకవర్గాల మార్పు వివాదం గురించే. కృష్ణా జిల్లాకు ఎన్టీయార్ పేరు పెడతానని అప్పుడెప్పుడో చెప్పినట్లే ఇపుడు చేశారు. కానీ అది హేతుబద్దంగా లేదనేది మెజారిటి జనాల భావన.
ఎందుకంటే కొత్తగా ఏర్పడిన విజయవాడ జిల్లాకు ఎన్టీయార్ పేరు పెట్టడం కన్నా మచిలీపట్నం కేంద్రంగా ఉన్న కృష్ణా జిల్లాకు ఎన్టీయార్ పేరు తగిలించటమే అన్నీ విధాల సరిపోతుందనేది మెజారిటి జనాల డిమాండ్. ఎలాగంటే ఎన్టీయార్ పుట్టి, పెరిగిన నిమ్మకూరు గుడివాడ నియోజకవర్గంలో ఉంది. గుడివాడ నియోజకవర్గం మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో ఉంది. పైగా ఎన్టీయార్ కు విజయవాడ కేంద్రంతో ఎప్పుడూ ఎలాంటి సంబంధం లేదని చాలామందంటున్నారు. కాబట్టి ఎన్టీయార్ పేరు విజయవాడ జిల్లాకన్నా కృష్ణా జిల్లాకు తగిలించి ఎన్టీయార్ కృష్ణాజిల్లాగా పిలిస్తే సరిగ్గా సూటవుతుందంటున్నారు.
ఇదే సమయంలో విజయవాడకు వంగవీటి రంగా పేరు పెడితే బాగుంటుందనే డిమాండ్లు పెరిగిపోతున్నాయి. ఇదేదో టీడీపీ నేతల రాజకీయంగా కాకుండా మెజారిటి ప్రజల భావనగా జగన్ అర్ధం చేసుకోవాలి. విజయవాడకు రంగా పేరు పెట్టేస్తే అటు కమ్మ, ఇటు కాపు సామాజికవర్గాలను పూర్తిగా సంతృప్తి పరిచినట్లవుతుంది. ఇదే విధంగా రాయచోటి జిల్లా కేంద్రంగా ప్రభుత్వం అన్నమయ్య జిల్లాను ఏర్పాటు చేసింది. ఇక్కడే జనాలు అభ్యంతరం చెబుతున్నారు. జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుండి రాజంపేటకు మార్చాలని డిమాండ్లు పెరిగిపోతున్నాయి. ఇలాంటివి మరికొన్ని డిమాండ్లకు కూడా అక్కడక్కడ వినబడుతున్నాయి.
కొత్త జిల్లాల ఏర్పాట్లు, జిల్లా కేంద్రాలు, పేర్లపైన ఎలాగు సూచనలు, సలహాలు, అభ్యంతరాలు చెప్పటానికి నెల రోజుల గడువిచ్చింది. కాబట్టి ఈ నెల రోజుల్లో వచ్చిన వాటిలో ఆచరణ సాధ్యమైన వాటికి జగన్ విలువ ఇవ్వాలి. నిజానికి జిల్లా కేంద్రాల ఏర్పాట్లు, పేర్ల విషయంలో వ్యక్తిగతంగా జగన్ కు పెద్దగా ఇంట్రస్టు ఉంటుందని అనుకునేందుకు లేదు. కాబట్టి మెజారిటి జనాల మనోభావాల ప్రకారం నడుచుకుంటే జనాలు కూడా హ్యాపీగా ఫీలవుతారు.