విశాఖ వివాదం : ఐ స్టాండ్ విత్ పోలీస్ నాట్ జగన్!

RATNA KISHORE
విశాఖ కేంద్రంగా వివాదం రేగుతోంది.నిన్న‌టి వేళ శార‌దాపీఠం వార్షికోత్స‌వాల‌కు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విచ్చేసిన సంద‌ర్భంగా మంత్రి సీదిరి అప్ప‌ల్రాజు పోలీసులతో వాగ్వాదానికి దిగిన వైనంపై తీవ్ర స్థాయిలో ఆరోప‌ణ‌లు వస్తున్నాయి.విమ‌ర్శ‌లు రేగుతున్నాయి.సీఎం రాక నేప‌థ్యంలో భ‌ద్ర‌తా ఏర్పాట్లలోభాగంగా అక్కడ విధులు నిర్వ‌ర్తిస్తున్న ఆరిలోవ సీఐను ఉద్దేశించి నోటికి వ‌చ్చిన విధంగా మంత్రి మాట్లాడారు.చొక్కా ప‌ట్టుకుని అవ‌త‌లికి విసిరేస్తాన‌న్నారు.అంతేకాదు ఇంకా ఏవేవో అన్నారు.
ఆఖ‌రికి అక్క‌డ ఉన్న ఎమ్మెల్సీ వంశీ కృష్ణ(విశాఖ వైసీపీ అధ్య‌క్షులు) స‌ర్ది చెప్పినా విన‌లేదు.బుజ్జ‌గింపులు చేసినా ప‌ట్టించుకోలేదు. విశాఖ సిటీ పోలీసు క‌మిష‌న‌ర్ వ‌చ్చి త‌న‌తో మాట్లాడాల‌ని ప‌ట్టుబ‌ట్టారు. ఆఖ‌రికి గొడ‌వ తేల‌క‌పోవ‌డంతో వెనుదిరిగిపోయారు మంత్రి. చిన్న‌బోయారు మంత్రి..ఆగ్ర‌హంతో అదుపు త‌ప్పి మాట‌లు తూటాలు పేలుస్తూ చెమట్లు పోశారు మంత్రి..ఇక చేసేది లేక ఈ విష‌యం తాను హోం మంత్రి ద‌గ్గ‌రే తేల్చుకుంటాన‌ని చెప్పి వెళ్లారు. ఆరిలోవ సీఐను సస్పెండ్ చేయిస్తాన‌ని శ‌ప‌థం చేసి మ‌రీ వెళ్లారు.
 
ఇక మంత్రి తీరుపై సొంత పార్టీ నేత‌లు కూడా క‌ల‌వ‌ర‌పాటుకు గురి అవుతున్నారు.నిన్న‌టి వేళ అక్క‌డున్న వైసీపీ నేత‌లు కూడా ఇరు వ‌ర్గాల‌కూ న‌చ్చ‌జెప్పేందుకే చూశారు అని స‌మాచారం.మంత్రి ఆగ్ర‌హంతో ఊగిపోయినా, సీఐ మాత్రం పెద్ద‌గా చ‌లించ‌లేదు. విశాఖ సిటీ క‌మిష‌న‌ర్ అస్స‌లు ఈ విష‌యాన్ని ప‌ట్టించుకోనే లేదు.వివాదాన్ని మీడియాలో బాగానే హైలెట్ చేస్తున్న‌జ‌ర్న‌లిస్టులు కూడా మంత్రి తప్పిదాల‌ను చెబుతున్నారే త‌ప్ప! పోలీసుల త‌ప్పు ఏమీ లేద‌నే అంటున్నారు.ఈ నేప‌థ్యంలో సీఎం జ‌గ‌న్ ఏ విధంగా స్పందిస్తారు? ఏ విధంగా నిర్ణ‌యాలు తీసుకుంటారు? అన్న‌ది ఇప్పుడిక చ‌ర్చ‌నీయాంశం.

సోష‌ల్ మీడియాలో మంత్రి వ్యాఖ్య‌లు అదేవిధంగా ఆయ‌న న‌డుచుకున్న తీరు,ఓ రౌడీ మాదిరి ప్ర‌వ‌ర్తించిన వైనంపై ట్రోల్స్ విపరీతంగా ఉన్నాయి.ప్ర‌జ‌లంతా తొలిసారి పోలీసులు వైపు ఉన్నారు అని కూడా నిర్థార‌ణ అవుతోంది. లేదు కాదు మాకు మా మ‌నుషులు ముఖ్యంగా మా మంత్రులే ముఖ్యం అనుకుంటే చేసేదేం లేదు కానీ జ‌గ‌న్ ఆ విధంగా న‌డుచుకోరు అనే అనుకోవాలి కొంత‌సేపు..ఈ విష‌య‌మై అసంబద్ధ స‌ల‌హాలేవీ విన‌రనే అనుకోవాలి.ఇక మంత్రి గారి రౌడీయిజానికి నియంత్ర‌ణ మంత్రంకూడా సీఎంనే ప‌ఠించాలి. అలా కాదు కూడదు అనుకుంటే ఈ మంత్రి కూడా మ‌రో కొడాలి నాని కావ‌డం త‌థ్యం.

 
 - ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: