అతి చిన్నస్థాయి నుంచి ఎదిగివచ్చారు పలాస నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి సీదిరి అప్పల్రాజు.వైద్యులు.స్వభావ రీత్యా ఒకనాడు చాలా అంటే చాలా సౌమ్యులు.పలాస చుట్టుపక్కల ప్రాంతాలలోనే కాదు ఒడిశా సరిహద్దు గ్రామాలకూ వైద్యుడిగానే ఆయన సుపరిచితుడు.కాస్తో కూస్తో సాయం చేసే లక్షణాలు ఉన్నవాడు.మంచి సాహిత్యం వస్తే ఆనందించేవాడు.ఇవన్నీ ఆయనకు ఆభరణాలు కావాలి.కానీ ఆయన కోపం అనే ఆయుధం దగ్గర ఇవన్నీ ఓడిపోతున్నాయి.దీంతో ఆయన తరుచూ వివాదాల్లోనే ఉంటున్నారు.వివాదాలతోనే కాలం గడిపేస్తున్నారు.
అతి ఆవేశమే అనర్థానికి కారణం
మొదటి సారి ఎమ్మెల్యేగా అయిన వెంటనే కొద్ది రోజుల వ్యవధిలో ఆయన స్పీడు నచ్చి,కొన్ని అనూహ్య పరిణామాల నేపథ్యంలో జగన్ ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. మత్స్య శాఖతో పాటు పశుసంవర్థక శాఖ కూడా కేటాయించారు. అప్పటి నుంచి ఆయన పంథానే మారిపోయింది.రివ్యూ మీటింగుల్లో ఎక్కువగా ఆయన అరుస్తారు. మంత్రి అనే హోదా మరిచి అధికారులను తిడతారు అన్న అభియోగాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవే కాకుండా ఆయన ఆవేశంలో ఉన్నప్పుడు అదుపుతప్పి మాట్లాడడమే కాకుండా చేయి చేసుకునేందుకు కూడా వెనుకాడరు అన్నది ఆయనకున్న మరో అవలక్షణం.
గతంలోనూ ఇలాంటి వివాదాలే నెలకొన్నాయి.కానీ అవన్నీ పలాస వరకూ ఆగిపోయి మంత్రి పరువును కాపాడాయి.ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే గౌతు శ్యామ సుందర శివాజీ కుటుంబంతోనూ ఆయన కుమార్తె గౌతు శిరీష(మొన్నటి ఎన్నికల్లో ఆయన ప్రత్యర్థి ఈమె)తోనూ విభేదాలు ఉన్నాయి.సోషల్ మీడియాలో ఆ వివాదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇవే కాకుండా చాలా వివాదాలు ఉన్నాయి.ఇవన్నీ ఎలా ఉన్నా ఆయన రియల్ ఎస్టేట్ వివాదాలను, భూ కబ్జాలను నిలువరించలేకపోతున్నారు అన్న అభియోగాలను మోస్తున్నారు.పలాస కేంద్రంగా ఆరోజు గౌతు శ్యామ సుందర
శివాజీ(టీడీపీ హయాంలో పలాస ఎమ్మెల్యే) అల్లుడు వెంకన్న చౌదరి తన మామ పేరు చెప్పుకుని రెచ్చిపోతే, వాటికి కొనసాగింపుగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను కూడా మంత్రి మాత్రం ఆపలేకపోతున్నారు.
కేవలం వివాదాస్పద మాటలే తప్ప ఆయన ఉద్దానం ప్రాంతానికి చేసిందేం లేదు అన్నది కూడా నిరూపణలో ఉన్న నిజం. క్రానిక్ కిడ్నీ డిసీజ్(సీకేడీ) తో సతమతం అయ్యే ఆ ప్రాంతానికి ముఖ్యమంత్రి ఓ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రకటించారు కానీ పలాస కేంద్రంగా ఆ ఏర్పాటు సంబంధిత పనులు మాత్రం అస్సలు వేగం అందుకోవడం లేదు అన్నది వాస్తవం.ఆయన ప్రజారోగ్యం పట్టని మంత్రిగా ఎందుకనో విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఓ వైద్యుడిగా ఆయన ఎంత పేరు తెచ్చుకున్నారో మంత్రిగా అంతకుమించిన చెడ్డపేరు తెచ్చుకుంటున్నారు అన్నది కూడా నిరూపణలో ఉన్న నిజమే!
- రత్నకిశోర్ శంభుమహంతి