దళిత బంధు దేశానికి ఆదర్శమని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం పోతారం(జె )గ్రామంలో మంగళవారం దళిత బంధు లబ్ధిదారులకు పాస్ పుస్తకాలు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దళిత బంధు దేశానికి ఆదర్శమని, ఈ స్కీమ్ ద్వారా రాష్ట్రం మొత్తం దళితులు అభివృద్ధి చెందుతారని తెలియజేశారు. ఇంత మంచి స్కీమ్ ద్వారా సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు అందుబాటులో ఉండి పాలన అందిస్తుంటే బిజెపి నాయకులు అవాకులు, చెవాకులు చేయడం సిగ్గుచేటన్నారు. కేంద్రంలో అధికారంలో ఉండి కూడా బ్యాక్వర్డ్ రీజియన్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఇవ్వాల్సి నటువంటి తొమ్మిది వందల కోట్ల రూపాయలను కేంద్రం ఇవ్వకుండా కాలయాపన చేస్తుందన్నారు.
వారు చేసేది అన్యాయం చెప్పేది మాత్రం శ్రీరంగనీతులు అని, ఎందుకు తెలంగాణ మీద అంత వివక్ష అని, ఎందుకు తెలంగాణపై ఇంత విషం చిమ్ముతున్నారని చాలా ఘాటుగా విమర్శించారు. బిజెపి నాయకులు ఏమీ చేయకుండా ఓవైపు ఎరువుల ధరలు పెంచి, వ్యవసాయ బావుల వద్ద మీటర్లు పెట్టాలనే ఆలోచనలో ఉన్నారని అన్నారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం నా గొంతులో ప్రాణం ఉండగా రైతుల వ్యవసాయ బావి వద్ద కరెంటు మీటరు పెట్టమని అన్నారని ఆయన తెలియజేశారు. దీనికి తోడుగా రైతులకు 24 గంటల కరెంటు ఇస్తానని కెసిఆర్ అంటున్నారని, అనడమే కాకుండా అమలు కూడా చేస్తున్నారని హరీష్ రావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలపై ధరలు పెంచి భారం వేశారు తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. కానీ టిఆర్ఎస్ గవర్నమెంట్ చెరువులు బాగా చేసింది, పదివేల రూపాయల రైతుబంధు అందజేస్తోంది, 24 గంటల కరెంటు ఇస్తోందని అన్నారు. మోడీ రాజ్యసభ లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై అవకతవకలు ఉన్నాయని అంటూ అక్కసును వెళ్లగక్కారు అని తెలియజేశారు.
దీన్ని ప్రజలు గమనించాలని బిజెపి తెలంగాణకు వ్యతిరేకంగా ఉందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా దళితులకు దళిత బందు ఇస్తున్నామని, దేశం మొత్తంలో 40 కోట్ల మంది దళితులు ఉంటారని, వారికి పెట్టింది మొత్తం పన్నెండు వేల కోట్లని, కానీ కేసీఆర్ ఒక తెలంగాణ రాష్ట్రంలోనే దళితులకే పదిహేను వేల కోట్ల రూపాయలు కేటాయిస్తానని మన కేసీఆర్ అంటున్నారని అన్నారు. మొత్తం దేశానికి ఎంత పెట్టారో, మన తెలంగాణ రాష్ట్రంలో అంతకంటే ఎక్కువ కేటాయిస్తున్నారని అన్నారు. అంటే కేంద్ర ప్రభుత్వానికి దళితుల మీద ఏమాత్రం ప్రేమ ఉందో ఇది చూస్తేనే కనబడుతుందని తెలియజేశారు.