అరకులో రాజకీయ సెగలు.. ఎమ్మెల్యే పాల్గుణ ఏమంటున్నారు..!

MOHAN BABU
ఆ నియోజకవర్గంలో లెక్కలు మారుతున్నాయా..? అంతా తన చేతులమీదే జరిగిందని చెప్పుకునే ఎమ్మెల్యేలకు కొత్త కుంపటి సెగ తప్పడం లేదా..? చల్లటి వాతావరణంలోనూ విశాఖ జిల్లా అరకు వ్యాలీ రాజకీయం వేడి పుట్టిస్తోంది. అధికార పార్టీలో అంతర్గత ఎత్తుగడలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎమ్మెల్యే శెట్టి ఫల్గుణ ఒకటి ఆశిస్తే ఫలితం మరో విధంగా వచ్చిందనే చర్చ జరుగుతోంది. ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గం అయిన అరకు వ్యాలీలో రాజకీయ చైతన్యం ఎక్కువ. ఇక్కడ ఎన్నికల ఫలితాలను సెటిలర్స్ ప్రభావితం చేస్తుంటారు.

వైసిపి ఆవిర్భావం తర్వాత అరకు వ్యాలీలో గట్టి పట్టు సాధించింది. 2014లో ఈ స్థానాన్ని గెలుచుకున్న వైసిపి 2019లోనూ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది.  బ్యాంకు ఉద్యోగం వదిలి రాజకీయాల్లోకి వచ్చిన ఫల్గుణ ఎమ్మెల్యే అయ్యారు. ఆ సమయంలో టికెట్ కోసం పార్టీలో పోటీ గట్టిగానే జరిగింది. మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు ఆఖరి నిమిషం వరకు ప్రయత్నించారు. స్థానికత, కమ్యూనిటీ వంటి అనేక ఈక్వేషన్ లను పరిగణలోకి తీసుకున్నా ఫల్గుణకే పార్టీ ఛాన్స్ ఇచ్చింది. ఎమ్మెల్యే వర్గానికి, రవిబాబు వర్గానికి గ్యాప్ వచ్చినట్టు పార్టీ వర్గాల్లో చెవులు కొరుక్కుంటున్నారు. కార్యక్రమాలకు ఇద్దరూ కలిసి హాజరవుతున్నా అంతా మొక్కుబడేనట. విశాఖ జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఎన్నికలు  అరకు వ్యాలీలో కొత్త సమీకరణాలకు కారణం అయినట్టు చర్చ నడుస్తోంది. జడ్పిటిసి గెలిచిన సుభద్రను జడ్పీ పీఠం వరించింది. పార్టీలో సీనియర్ నాయకులు చాలామంది ఈ పదవిని ఆశించారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు జడ్పీ పీఠం తమకే దక్కుతుందని జి.కె.వి జడ్పిటిసి భర్త విశ్వేశ్వర రాజు లెక్కలేసుకున్నారట. అనూహ్యంగా సుభద్ర చైర్ పర్సన్ కావడంతో స్థానిక ఎమ్మెల్యే శెట్టి ఫాల్గున లంబియింగే కారణమని ప్రచారం జరిగింది. మొదట్లో జడ్పీ చైర్ పర్సన్, ఎమ్మెల్యే ఇద్దరూ కలిసే అధికారిక కార్యక్రమాలకు హాజరయ్యే వారు. కానీ మూడు నెలల్లోనే రాజకీయం మారిపోయిందట. కుంభా రవిబాబు వర్గానికి జడ్పీ చైర్ పర్సన్ సుభద్ర దగ్గరయ్యారని టాక్. దీనికి సామాజిక వర్గాలు కలిసి రావడమే కారణంగా చెబుతున్నారు. అరకు వ్యాలీలో కుల ప్రాతిపదికనే రాజకీయాలు ఆధారపడతాయి. భగత, వాల్మీకి, కొండ దొరలదే ఇక్కడ ఆధిపత్యం. మాజీ ఎమ్మెల్యే రవిబాబు జడ్పీ చైర్ పర్సన్ భర్త ఒకే సామాజిక వర్గం. వీరిద్దరిదీ గుంటూరు జిల్లా కావడం కలిసొచ్చిన అంశంగా భావిస్తున్నారట. పైగా ఎమ్మెల్యే ఫల్గుణ దూసుకెళ్లడం మీదనే అభిప్రాయం ప్రత్యర్థి వర్గంలో ఉందట.

అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదన్నది ఆ వర్గం చెప్పేమాట. అవకాశం అంది వచ్చిందని, దానిని సద్వినియోగం చేసుకోవాలని ఆలోచనలో రవిబాబు ఉన్నట్టు సమాచారం. ఆ వ్యూహంలో భాగంగానే రవిబాబు జడ్పీ చైర్ పర్సన్ వర్గాలు ఒక్కటైనట్టు పార్టీ శ్రేణులు చెవులు కొరుక్కుంటున్నాయి. మొత్తం మీద కోరి తెచ్చుకుంటే కుంపటి రాజుకుందని ఎమ్మెల్యే ఫల్గుణ వర్గం కక్కలేక మింగలేక లబోదిబోమంటుదట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: