ఏపీలో తొలిరోజు ఎంత మంది బడికి వచ్చారో తెలుసా...!

Podili Ravindranath
వారం రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు అన్ని విద్యా సంస్థలు తెరుచుకున్నాయి. సంక్రాంతి పండుగ సెలవుల అనంతరం ఈ నెల 17వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కాలేజీలు పునఃప్రారంభం అయ్యాయి. ఈ నెల 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. కరోనా వైరస్ కారణంగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం అన్ని విద్యా సంస్థలకు ఈ నెల 30వ తేదీ వరకు సెలవులు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. అలాగే ఏపీలో కూడా పొడిగిస్తారని అంతా భావించారు. కానీ ప్రస్తుతానికి అలాంటి ఆలోచన లేదని ముందే తేల్చేశారు విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. విద్యా సంస్థలు యధావిధిగా తెరుచుకుంటాయని కూడా ప్రకటించారు. అన్నట్లుగానే ఈ రోజు నుంచి అన్ని విద్యా సంస్థలు సంక్రాంతి పండుగ తర్వాత తెరుచుకున్నాయి. అయితే ఓ వైపు రాష్ట్రంలో రోజు వారీ వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో... విద్యార్థుల తల్లిదండ్రుల్లో భయాందోళన మొదలైంది.
తల్లిదండ్రుల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ అనుమానాల నివృత్తి కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వ విద్యా శాఖ. ఇందులో రెండు నంబర్లను కూడా అందుబాటులో ఉంచింది. తొలిరోజున విద్యార్థులు ఉత్సాహంగా పాఠశాలకు వచ్చారని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా తొలిరోజే 61 శాతం విద్యార్థులు హాజరయ్యారని.... రెండు రోజుల్లో ఇది 80 శాతం దాటుతుందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తున్నామన్నారు. అలాగే కేంద్రం సూచించిన విధంగా ఇప్పటికే 15 నుంచి 18 ఏళ్ల వయసున్న విద్యార్థులకు కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతుందన్నారు మంత్రి. విద్యార్థుల ఆరోగ్య భద్రత పట్ల ప్రభుత్వం పూర్తి శ్రద్ధతో ఉందన్నారు కూడా. తొలిరోజున అత్యధికంగా అనంతపురం జిల్లాలో 70 శాతం మంది విద్యార్థులు హాజరవ్వగా... కడప జిల్లాలో 69 శాతం, గుంటూరు 68, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో 67 శాతం హాజరు నమోదు అయ్యిందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: