ఏపీ టికెట్ : మంచు విష్ణు ఏం చెప్పాడ్రా?
వివాదం ఎలా ఉన్నా స్పందించడం ముఖ్యం. చిరు మొదలుకుని చాలా చిన్న హీరోల వరకూ టికెట్ రేట్లపై అంతర్మథనం చెందుతూ ఉంటే బాధ్యతయుతమయిన పదవుల్లో ఉన్నవారు నోరు మెదపకపోవడంతో చిత్ర సీమలో కలవరం రేగుతోంది. మా అధ్యక్షుడిగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో్ మాట్లాడేంత చొరవ ఉన్నప్పటికీ విష్ణూ మాత్రం పెదవి విప్పడం లేదు. దీంతో ఇండస్ట్రీకి మేలు జరగకపోగా కీడే ఎక్కువగా జరుగుతోంది.
ఏపీలో టికెట్ ధరల తగ్గింపుపై ఒకవైపు పెద్ద రగడే జరుగుతుంటే మరో వైపు ఇండస్ట్రీ పెద్దగా ఉండాల్సిన వారంతా సైలెంట్ అయిపోతున్నారు.మా అధ్యక్షుడిగా ఉన్న మంచు విష్ణు కూడా ఇందుకు మినహాయింపు కాదు.ఇంతవరకూ గొడవ జరుగుతున్నా ఒక్క మాట కూడా మాట్లాడని విష్ణు తాజా పరిణామాల నేపథ్యంలో ఇది పెద్దలకు సంబంధించిన విషయమని,వాళ్లు చూసుకుంటారని తప్పించుకునే ధోరణిలో మాట్లాడారు. ఇప్పటికే ఛాంబర్ కు చెందిన పెద్దలు, ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నందున ఇప్పుడు వ్యక్తిగతంగా వ్యాఖ్యానించడం తగదని హితవు చెప్పారు. ఇవన్నీ ఎలా ఉన్నా మంచు విష్ణు మాట్లాడిన మాటల్లో ఇండస్ట్రీకి మేలు చేసేవి ఏమీ లేవు.అదేవిధంగా ఆయన తరఫు సాయం కూడా లేదు. అలాంటప్పుడు సమస్య ఎలా పరిష్కారం అవుతుందని?
మా అధ్యక్షుడి హోదాలో ఈపాటికే ఓ అడుగు ముందుకు వేసి ఏపీ సీఎం జగన్ తో మాట్లాడాల్సిన విష్ణు ఆ పని చేయకపోగా, ఇప్పుడు మాత్రం ఇది పెద్దలకు సంబంధించిన మేటర్ అని తప్పుకోవడంలో ఉన్న ఆంతర్యం ఏంటి? అంటే ఏపీ ప్రభుత్వ పెద్దలు ఆయన బంధు గణం కావడంతోనే విష్ణు స్పందించడం లేదా?లేకా మరే ఇతర కారణాలేమయినా ఉన్నాయా? ఇంతవరకూ ఏడాదికి పైగా నలుగుతున్న విషయం పై కనీసం స్పందించని మా అధ్యక్షుడు రేపటి వేళ ముఖ్యమయిన సమస్యలు ఎలా పరిష్కరిస్తారని?