జగన్, చిరు భేటీ సీక్రెట్‌ బయటపెట్టిన రఘురామ..?

Chakravarthi Kalyan
ఏపీ సీఎం జగన్‌తో మెగాస్టార్‌ చిరంజీవి భేటీ అయ్యారు. సినీపరిశ్రమకు సంబంధించిన అనేక అంశాలపై వీరిద్దరూ చర్చించారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ చాలా సంతృప్తికరంగా జరిగిందని మీటింగ్ తర్వాత చిరంజీవి అన్నారు. పండుగ పూట తనను ఒక సోదరుడుగా జగన్ భావించిన  నన్ను ఆహ్వానించి విందు భోజనం పెట్టడం సంతోషంగా ఉందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. జగన్‌తో భేటీలో ఇండస్ట్రీ, ఎగ్జిబిటర్ల సాధక బాధలు సీఎంకు వివరించానని.. తాను చెప్పిన అన్ని విషయాలను సీఎం సానుకూలంగా ఆలకించారని మెగాస్టార్ తెలిపారు.

సినీ పరిశ్రమ విషయంలో సీఎం జగన్ స్పందన తనకు సంతృప్తినిచ్చిందన్న చిరంజీవి..  పైకి కన్పించినంత గ్లామర్ గా సినీ ఫీల్డ్ ఉండదని.. రెక్కాడితే కాని డొక్కాడని పేదలు ఇండస్ట్రీని నమ్ముకుని ఉన్నారని అన్నారు. పరిశ్రమ సమస్యలన్నీ సీఎంకు వివరించానని.. అన్ని రకాలుగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటామని జగన్ చెప్పారని చిరంజీవి చెప్పారు.

అయితే.. సినీపరిశ్రమ కోసం చిరంజీవి జగన్‌ను కలిశారని అంతా అనుకుంటుంటే.. ఎంపీ రఘురామ కృష్ణంరాజు మాత్రం ఇందులో కొత్త కోణం బయటకు తీశారు. జగన్‌ కేసులో లాయరే ఆచార్య నిర్మాతం అంటూ సంచలన విషయం బయటపెట్టారు. జగన్‌కు చేదోడువాదోడుగా ఉండే నిరంజన్‌ రెడ్డే ఇప్పుడు చిరంజీవి ఆచార్య సినిమాకు నిర్మాత అని ఎంపీ రఘురామకృష్ణరాజు అంటున్నారు. అందుకనే సినిమా పరిశ్రమకు న్యాయం చేయించేందుకు చిరంజీవిని ముఖ్యమంత్రితో సమావేశపరిచారని ఎంపీ రఘురామ అభిప్రాయపడ్డారు.

ఏది ఏమైనా.. ఈ సమావేశం తర్వాతయినా సినీపరిశ్రమపై దాడి ఆగిపోవాలని కోరుకుంటున్నట్లు ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. కొందరు వైసీపీ నాయకులు సినిమా ఇండస్ట్రీపై చేస్తున్న విమర్శల గురించి స్పందించిన రఘురామ.. సినీ పరిశ్రమ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజకీయ నాయకులకే ఒళ్లు బలిసిందని ప్రజలు అనుకుంటున్నారన్నారు. మరి చిరంజీవి సినిమా నిర్మాత జగన్‌ లాయర్ అన్న విమర్శలపై ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: