గోదావరి : పవన్ పోటీ చేయబోయే నియోజకవర్గాలివేనా ?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేయబోయే నియోజకవర్గాలు ఫైనల్ అయినట్లే ఉన్నాయి. మొన్నటిసారిలాగే రాబోయే ఎన్నికల్లో కూడా రెండు నియోజకవర్గాల నుండి పోటీ చేయాలని పవన్ డిసైడ్ అయ్యారట. ఇంతకీ ఆ నియోజకవర్గాలు ఏమిటంటే కాకినాడ సిటి, కాకినాడ రూరల్. అంటే రెండు పక్క పక్క నియోజకవర్గాలే లేండి. ప్రస్తుతం కాకినాడ సిటి నియోజకవర్గంలో ద్వారపూడి చంద్రశేఖరరెడ్డి, కాకినాడ రూరల్ కు మంత్రి కన్నబాబు వైసీపీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
పై రెండు నియోజకవర్గాలనే పవన్ ఎందుకు ఎంపిక చేసుకున్నట్లు ? ఎందుకంటే రెండు కారణాలున్నాయి. మొదటిదేమో ఈ నియోజకవర్గాల్లో కాపుల ఓట్లు ఎక్కువగా ఉండటం. రెండో కారణం ఏమిటంటే ద్వారంపూడి, కన్నబాబులను ఎలాగైనా ఓడించాలని పవన్ గట్టాగా డిసైడ్ అవ్వటమే. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీతో పొత్తుంటే రెండు చోట్లనుండి పవనే పోటీ చేయాలని అనుకుంటున్నారట. పొత్తు లేకపోతే ఏమి చేస్తారనే విషయంలో మాత్రం క్లారిటి లేదు.
పవన్ ఆలోచన చూస్తుంటే మొన్నటి ఎన్నికల్లో పోటీచేసిన భీమవరం, గాజువాక నియోజకవర్గాలను వదిలేసినట్లే అనుకోవాలి. మొన్నటి ఎన్నికల ముందు కూడా కాపులు ఎక్కువగా ఎక్కడున్నారు ? తనకు గెలుపు అవకాశాలు ఎక్కడ ఎక్కువగా ఉంది ? అనే విషయాలను బాగా స్టడీ చేయించుకున్న తర్వాతే పోటీచేశారు. అంత స్టడీ చేయించుకుని పోటీచేసిన నియోజకవర్గాల్లోనే ఓడిపోయారు.
అలాంటిది రాబోయే ఎన్నికల్లో పోటీకి ముందు ఏమి స్టడీ చేస్తున్నారో లేకపోతే సర్వే చేయించుకుంటున్నారో తెలీదు. గాజువాక నుండే పోటీ చేస్తానని పవన్ చాలాసార్లు చెప్పిన అవన్నీ కతలని తేలిపోతోంది. కాకినాడ, కాకినాడ రూరల్ నియోజకవర్గాల్లో టీడీపీకి మంచి ఓటు బ్యాంకే ఉంది. అయితే జనసేన ఓటుబ్యాంకు గురించి స్పష్టమైన ఫీడ్ బ్యాక్ లేదు. కాకపోతే కాపులు అధికంగా ఉంటారనేది వాస్తవం. మరి రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటాయా ? అనే దానిమీదే పవన్ పోటీ ఆధారపడిందనేది వాస్తవం. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.