బీజేపీ తూటా: కేసీఆర్ కలల్లోనూ బండి సంజయ్..?
ఇతర రాష్ట్రాల్లో బీజేపీ నేతలను సైతం తెలంగాణ పర్యటనలకు రప్పిస్తూ పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. అలా తెలంగాణకు వచ్చిన మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్.. తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేసారు. కేసీఆర్‌ను పిరికి సీఎంగా.. బండి సంజయ్‌ను పోరాట వీరుడిగా పేర్కొన్నారు. కేసీఆర్ లాంటి పిరికి సీఎంను ఎక్కడా చూడలేదన్న శివరాజ్‌సింగ్ చౌహాన్.. విపక్షాల ప్రశ్నకు బదులిచ్చే సంప్రదాయం టీఆర్‌ఎస్‌లో కనిపించడం లేదని ఎద్దేవా చేశారు.
న్యాయం కోసం బీజేపీ ఉద్యమిస్తే కేసీఆర్ భయపడిపోయి అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని శివరాజ్ సింగ్ ఆరోపించారు. బీజేపీ ఎవరి బెదిరింపులకూ భయపడే పార్టీ కాదన్న శివరాజ్‌సింగ్.. కేసీఆర్‌కు కలలో కూడా బండి సంజయ్ గుర్తుకొస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీని పంజాబ్‌లో 20 నిమిషాలు అడ్డుకుంటే కేసీఆర్ మద్దతిస్తారా.. అని శివరాజ్‌సింగ్ ప్రశ్నించారు. ఇదేం రాజనీతి అని నిలదీశారు.
గతంలో టీఆర్ఎస్ ఇచ్చిన ఎన్నికల హామీలపైనా శివరాజ్ సింగ్ విమర్శలు చేశారు. డబుల్ బెడ్‌రూమ్, నిరుద్యోగ భృతి, కేజీ టూ పీజీ ఏమయ్యాయని ప్రశ్నించారు. రైతు వ్యతిరేకి కేసీఆర్‌ను గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని.. అవినీతి, నియంత, కుటుంబపాలనపై బండి సంజయ్ పోరాటం కొనసాగుతుందని శివరాజ్ సింగ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో భాజపా అధికారంలోకి వస్తుందని.. ఇందుకు అవసరమైన యుద్ధం ఇప్పిటకే మొదలైందని శివరాజ్‌సింగ్ చౌహాన్ అన్నారు. మరి బీజేపీ కలలు నెరవేరతాయా..?