బాబోరు : ఏమి పర్వాలేదు.. వారందరూ పార్టీ నుంచి వెళ్లిపోవచ్చు..ఎందుకంటే..?
ఎవరైనా ఇష్టం లేని వారు ఉంటే దండం పెట్టి ఆ బాధ్యత నుంచి తప్పుకోవాల్సిందేనని పేర్కొన్నారు చంద్రబాబు. పార్టీ ఏమి బాధపడదని.. కొత్త వారికి అవకాశం వస్తుందని, పార్టీ కోసం పని చేయకుండా పదవులు రావాలని, అధికారం లోకి రావాలని కోరుకుంటే ఉపయోగం లేదు అన్నారు. పార్టీలో ఉండి పార్టీకి నష్టం చేసే వ్యక్తులను ఎట్టి పరిస్థితిలో కూడా ఉపేక్షించబోను అని హెచ్చరించారు. టీడీపీకి వచ్చే ఎన్నికలు ఆషామాషీ కాదు అన్నారు. వైఎస్సార్‌సీపీ రౌడియిజాన్ని, దౌర్జన్యాల్ని అరాచకాలను ఎదుర్కొని నిలవాలంటే.. ఢీ అంటే ఢీ అనే నాయకత్వమే కావాలన్నారు.
టీడీపీ అధినేత సొంత నియోజకవర్గమైన కుప్పంలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే టీడీపీ నియోజకవర్గమైన కుప్పంలో తాను అంటే ఎంతో అభిమానం అని, ఆ నియోజకవర్గంలో ఇబ్బందులు పెట్టారని, మిగిలిన నియోజకవర్గాల్లో పరిస్థితి ఏవిధంగా ఉందో ఒకసారి ఆలోచించుకోవాలన్నారు చంద్రబాబు. రాబోయే రోజుల్లో నాయకులు పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టిపెట్టాలని, గ్రామ మండల పట్టణ కమిటీలు, 15లోపు పూర్తి చేయాలని సూచించారు. ఎన్నికల నిర్వహణకు ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు క్లస్టర్, యూనిట్, బూత్ కమిటీలు వేసుకోవాలన్నారు.
ప్రతీ 100 ఓట్లకు ఒక బూత్ కమిటీని, బీఎల్ఏలను ఏర్పాటు చేసుకుని ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అరాచకాలు, వాస్తవాలను ప్రజలకు తెలియజెప్పాలని చంద్రబాబు పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో సమర్థవంతమైన, ప్రజలలో పలుకుబడి, నిత్యం ప్రజలతో మమేకమయ్యే వారిని గుర్తించి అభ్యర్థులుగా ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. జనవరి 18న ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఎన్టీఆర్ వర్థంతి కార్యక్రమం చేపట్టాలని.. ఆరోజు మెంబర్ షిప్ డ్రైవ్ కూడా ప్రారంభిస్తామని వెల్లడించారు చంద్రబాబు.