హరీశ్‌రావు : పిల్లలకు టీకా వేయించాలి.. ఇక వారిదే బాధ్యత..!
తెలంగాణలో రోజు రోజుకు ఓవైపు కరోనా.. మరోవైపు ఒమిక్రాన్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇవ్వాళ కరోనా కట్టడికి 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వయస్సు కలిగిన పిల్లల కోసం టీకాను ప్రవేశపెట్టింది ప్రభుత్వం. అయితే రాష్ట్రవ్యాప్తంగా 1,014 కేంద్రాలలో టీకాలు పంపిణీ చేయనున్నట్టు తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ఇవాళ బంజారాహిల్స్ పీహెచ్‌సీలో పిల్లల టీకా కార్యక్రమాన్ని ప్రారంభించి మీడియాతో ముచ్చటించారు.
అర్హులైన పిల్లలందరికీ కొవాగ్జిన్ టీకా ఇస్తామని చెప్పారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమక్షంలో పిల్లలకు వాక్సినేషన్ జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే టీకాలు వేస్తున్నారు. తల్లిదండ్రులు విధిగా పిల్లలకు వాక్సిన్ వేయించాలని సూచించారు మంత్రి హరీశ్‌రావు. పిల్లలకు టీకాలు వేయించే బాధ్యత తల్లిదండ్రులదే అని, కళాశాలల యాజమాన్యాలు కూడా బాధ్యత తీసుకోవాలి అని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ, ప్రయివేటు అని తేడా లేకుండా పిల్లలందరికీ టీకాలు వేయించాలని సూచించారు.
అదేవిధంగా ప్రయివేటు ఆసుపత్రులలో కూడా పిల్లలకు టీకాలు ఇచ్చే అనుమతి ఉన్నదని.. 12 కార్పొరేషన్‌లలో ఆన్‌లైన్, ఇతర ప్రాంతాల్లో వాక్ ఇన్ పద్దతిలో టీకాలు ఇస్తున్నాం. నాలుగు రోజుల తరువాత పరిస్థితుల ఆధారంగా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌పై మరొకసారి నిర్ణయం తీసుకుంటాం. బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, కళాశాల ఐడీ కార్డు ఉన్నా రిజిస్ట్రేషన్‌కు సరిపోతుందని చెప్పారు మంత్రి హరీశ్‌రావు.
ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని రకాల మందులు, సదుపాయాలున్నాయని, 21 లక్షల హోం ఐసోలేషన్ కిట్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ప్రయివేటు ఆసుపత్రి వద్దకు వెళ్లి డబ్బులు ఖర్చు చేసుకోవద్దని సూచించారు. కరోనా టీకాలపై ఎలాంటి అపోహలు అవసరం లేదు అని, వాక్సిన్ తీసుకుంటే రక్షణ కవచంలా పని చేస్తుందని చెప్పారు. వారం రోజుల్లోనే కరోనా, ఒమిక్రాన్ కేసులు రెట్టింపు అవుతున్నాయని.. లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం కూడా పూర్తి సంసిద్ధంగా ఉందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.