దేశంలో అతిపెద్దదయిన నుమాయిష్ ఎగ్జిబీషన్ అంటే హైదరాబాద్ నగరవాసులకు చాలా ఇష్టం. ప్రతి సంవత్సరం జనవరి 1నుంచి 45 రోజుల పాటు నాంపల్లి గ్రౌండ్ లో జరుగుతుంది. గతేడాది కరోనా కారణంగా రద్దయింది. ఇప్పుడు మళ్లీ ప్రారంభం కావడంతో వేల సంఖ్యలో స్టాళ్లు.. ఇతర రాష్ట్రాలకు చెందిన వస్తువులు, వినోదాలతో సిటీ కోలాహలంగా మారింది. అయితే, ఈ ఎగ్జిబిషన్ కు బీజం పడి సరిగ్గా 85 ఏళ్లు అవుతోంది. నిజానికి ఈ ఎగ్జిబీషన్ ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే.. అప్పట్లో హైదరాబాద్ సంస్థాన ప్రజల ఆర్థిక స్థితిగతులు తెలుసుకోవడానికి సర్వే నిర్వహించాలనుకుంది.
కానీ, అందుకు సరిపడా నిధులు లేకపోవడంతో నిధుల సేకరణకు పబ్లిక్ గార్డెన్స్‌లో మొదటి సారిగా స్థానిక ఉత్పత్తులతో ఎగ్జిబీషన్ ఏర్పాటు చేశారు. అప్పుడు 80 స్టాల్స్ తో రూ.2.5 లక్షల ఖర్చుతో ప్రారంభమయింది. ఇప్పుడు దాదాపు 3,500 పైగా స్టాల్స్, వందల కోట్ల రూపాయాల వ్యాపారానికి చేరుకుంది. 1946 వరకు పబ్లిక్ గార్డెన్స్‌లో నిర్వహించిన నుమాయిష్ ను తరువాత స్థలం సమస్యతో నాంపెల్లి గ్రౌండ్‌కు మార్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడే కొనసాగుతోంది. దేశంలోనే అతిపెద్దదిగా గుర్తింపు పొందిన నుమాయిష్‌లో రూ.10 నుంచి ప్రారంభమై.. లక్షల రూపాలయ విలువైన వస్తువులు దొరుకుతుంటాయి.
ఆహార పదార్థాలతో పాటు సంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. 1947 లో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1948లో హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం కావడంతో ఆ రెండెళ్లూ ఎగ్జిబీషన్ నిర్వహించలేదు. మళ్లీ 1948 లో నాంపల్లి మైదానంలో తిరిగి అప్పటి హైదరాబాద్ రాష్ట్ర గవర్నర్ జనరల్ సి.రాజగోపాల చారి ప్రారంభించారు. ఆ సమయంలోనే నుమాయిష్ గా ఉన్న పేరును ఆల్ ఇండియా ఇండస్ట్రీయల్ ఎగ్జిబిషన్ గా మార్పు చేశారు. అప్పటి నుంచి నిరాటంకంగా సాగిన ఎగ్జీబీషన్ పోయిన ఏడాది కరోనా కారణంగా రద్దయింది.