టీడీపీలోకి ఆ రెడ్డి గారు రీ ఎంట్రీకి ముహూర్తం రెడీ...?
అయితే ఇప్పుడున్న పరిస్తితుల్లో చాలావరకు టీడీపీకి కాస్త పట్టు దొరికినట్లే కనిపిస్తోంది. ఇంకా పట్టు పెంచుకుని సత్తా చాటాలని టీడీపీ చూస్తుంది. ముఖ్యంగా బలం తక్కువ ఉన్న రాయలసీమ జిల్లాల్లో బలపడాలని టీడీపీ ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలోనే కీలకంగా ఉన్న కర్నూలు జిల్లాలో వైసీపీకి ధీటుగా ఎదిగేందుకు టీడీపీ ముందుకెళుతుంది. గత ఎన్నికల్లో టీడీపీకి ఒక్క సీటు కూడా రాలేదు.
కానీ ఈ సారి సగం సీట్లు అయిన గెలవాలని టీడీపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే మూడు, నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ పట్టు సాధించినట్లే కనిపిస్తోంది. ఇంకా మరిన్ని నియోజకవర్గాల్లో పట్టు దక్కించుకోవాలని చూస్తుంది. ఇదే క్రమంలో జిల్లాలో ఉన్న కొందరు బలమైన నాయకులని టీడీపీలోకి తీసుకోచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిని మళ్ళీ టీడీపీ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
గతంలో బైరెడ్డి టీడీపీలోనే పనిచేసి బయటకు వెళ్ళిన విషయం తెలిసిందే. ప్రస్తుతానికి ఆయన బీజేపీలో పనిచేస్తున్నారు. అయితే బీజేపీలో ఉంటే నెక్స్ట్ గెలవడానికి ఏ మాత్రం అవకాశాలు లేవు. టీడీపీకైతే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందుకే బైరెడ్డిని ఆ సమీకరణ ఆధారంగానే టీడీపీలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. బైరెడ్డి టీడీపీలోకి వస్తే నందికొట్కూరు, పాణ్యం నియోజకవర్గాల్లో టీడీపీకి కాస్త ప్లస్ అవుతుంది. మరి చూడాలి బైరెడ్డి అంత తేలికగా టీడీపీలోకి వస్తారో లేదో?