ఒమిక్రాన్ ఎఫెక్ట్: ఏపీలో స్కూళ్లకు సెలవలు ప్రకటిస్తారా..?

Deekshitha Reddy
దేశవ్యాప్తంగా సెకండ్ వేవ్ ప్రారంభంలో ఎలాంటి పరిస్థితుల్ని చూశామో.. సరిగ్గా ఇప్పుడు కూడా అవే రిపీట్ అవుతున్నాయి. ముందుగా అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించారు. ఆ తర్వాత దేశంలో రవాణా తగ్గిపోయింది. ప్రస్తుతం ఢిల్లీలో ఇతర రాష్ట్రాలనుంచి వచ్చే బస్సుల్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీని అమలు చేస్తున్నారు. మెట్రో రైళ్లలో కూడా అదే విధానం అమలులో ఉంది. ఇక ఢిల్లీలో ఇప్పటికే స్కూళ్లు, కాలేజీలు, సినిమా థియేటర్లకు తాళం వేశారు.

కొవిడ్ కేసులు పెరుగుతున్న సమయంలో ముందుగా విందు, వినోదాలపై ఆంక్షలు ఉంటాయి. ఆ తర్వాత విద్యాసంస్థల జోలికి వస్తారు. ఢిల్లీలో వివాహ కార్యక్రమాలపై ఇలాగే ఆంక్షలు పెట్టారు. సినిమా హాళ్లు మూసివేయాలని ఆదేశాలిచ్చారు. వాటితోపాటు ముందు జాగ్రత్తగా స్కూళ్లు కూడా మూసివేశారు. జనవరి 2 నుంచి చిన్నారుల టీకా అందుబాటులోకి వచ్చినా కేవలం 15 సంవత్సరాల పైబడినవారికి మాత్రమే టీకా ఇస్తారు కాబట్టి.. స్కూళ్ల విషయంలో ఢిల్లీ సర్కారు రాజీ పడలేదు.

ఢిల్లీ బాటలో ఎవరెవరు..?
ప్రస్తుతం ఢిల్లీ బాటలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా స్కూళ్లకు సెలవలు ప్రకటించింది. పశ్చిమబెంగాల్ లో కూడా ప్రస్తుతం స్కూళ్లు, కాలేజీలు, ఇతర విద్యా సంస్థలకు సెలవలు ఇచ్చారు. అయితే ఈ ట్రెండ్ మిగతా రాష్ట్రాలు కూడా కొనసాగిస్తాయో లేదో చూడాలి. ప్రస్తుతం ఏపీలో కూడా ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఒక్కరోజులోనే కొత్తగా 10మందికి ఒమిక్రాన్ గుర్తించారు. దీంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 16కి పెరిగిందని చెబుతున్నారు. ప్రస్తుతానికి ఏపీలో ఎలాంటి ఆంక్షలు లేవు, అయితే ఇదే తరహాలో కేసులు పెరిగితే కఠిన నిర్ణయాలు తీసుకునే అకాశముందని మాత్రం తెలుస్తోంది. గతంలో మిగతా అన్ని రాష్ట్రాలు నిబంధనలు సడలించినా.. ఏపీ మాత్రం చాన్నాళ్లపాటు నైట్ కర్ఫ్యూ కొనసాగించింది. మరిప్పుడు ముందు జాగ్రత్త విషయంలో ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఢిల్లీ, పశ్చిమబెంగాల్ తరహాలో.. స్కూళ్లు, కాలేజీలకు సెలవలు ఇస్తారా..? లేదా మరికొంతకాలం వేచి చూస్తారా అనేది త్వరలోనే తెలుస్తుంది. ప్రస్తుతం ఆంక్షల విషయంలో ఏపీ సర్కారు కఠినంగానే ఉంది. మాస్క్ లేకపోతే జరిమానాలు విధిస్తామని ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: