వైఎస్సార్ మరణానంతరం జగన్ అన్న కోసం చెల్లి షర్మిల ఎంతగానో పరిశ్రమించారు అన్నది నిజం. ఆ రోజు ఆమె తన అన్నకు రాజ్యాధికారం దక్కేందుకు రికార్డు స్థాయిలో పాదయాత్ర చేసి నాన్న ను సైతం మరిపించేలా మాట్లాడి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తరువాత పరిణామాల్లో జగన్ జైల్లో ఉండగా పార్టీని బతికించేందుకు బ్రదర్ అనీల్ ఆర్థిక సాయం చేశారని ఇప్పటికీ అంటుంటారు కొందరు జగన్ అభిమానులు. ఆ విధంగా ఇంటి కూతురు,అల్లుడు వైసీపీకి అండగా నిలిచి పార్టీ పురోభివృద్ధి ఇవాళ పార్టీ వైభవానికి కూడా వారే కారణం అయ్యారు అని చెప్పడంలో సందేహమే లేదు. పార్టీ అధికారంలోకి వచ్చాక జగన్ మనసు మారిపోయింది. పరిమళ్ నత్వానీ లాంటి బడాబాబులకు, అంబానీ నేస్తాలకు రాజ్య సభ టికెట్ ఇచ్చారే కానీ సొంత చెల్లి అయిన షర్మిలకు మాత్రం ఆ పాటి ప్రాధాన్యం కూడా దక్కలేదు.
రాజ్య సభ సీటు కాదు కానీ కనీసం ఎమ్మెల్సీ అయినా చేసి క్యాబినెట్ లో చోటు ఇస్తారని అంతా భావించినా అది కూడా జరగలేదు. షర్మిలను మంత్రిని చేస్తే తెలంగాణలో కేసీఆర్ మాదిరిగా తనదీ కుటుంబ పాలనే అనుకుంటారని భావించి జగన్ వెనక్కు తగ్గారని ఇప్పటికీ కొందరు వైసీపీ ప్రతినిధులు అంటుంటారు. కారణం ఏమయినా ఆమె పార్టీకి దూరంగా ఉంటూ సొంతంగా ఎదిగేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే మొన్నటి వేళ నాన్న రాజన్న వర్థంతిని కూడా చాలా ఘనంగా చేశారు. ఆ సందర్భంలో కూడా ఎక్కడా అన్న పేరు ప్రస్తావనకు తేలేదు.
విజయమ్మ మాత్రం దేవుడి ఆశీస్సులు ఫలితంగా రాజన్న పేరు నిలబెట్టేలా తన కొడుకు, కూతురు ప్రజల కోసం అహర్నిశలూ పరిశ్రమిస్తూ మంచి పేరు తెచ్చుకుని తండ్రి తగ్గ రీతిలో రాణిస్తున్నారని మాత్రం పేర్కొన్నారు. ఇక ఇడుపుల పాయలో తాజా పరిణామాల నేపథ్యంలో ఆ కుటుంబంలో తగాదాలున్నాయని, వాటిని షర్మిలే పెంచి పెద్ద చేస్తున్నారని కొందరు అంటున్నారు. అయితే జగన్ వెర్షన్ మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ఇవన్నీ తాము చెప్పకుండా అబద్ధాలు రాసుకుని పోవడం తగదని చెబుతున్నారు.