స్టీల్ ప్లాంట్ పైవేటీకరణ ఆగదా..?
విశాఖ నగరాభివృద్దికి ఎంతగానో దోహదపడిన స్టీల్ ప్లాంట్ మొత్తం రాష్ట్రానికి కూడా కీలకమే. ప్రత్యక్షంగా పరోక్షంగా ఏపీలో అత్యధికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న పరిశ్రమ ఇది. దాదాపు 17 వేలమంది శాశ్వత ఉద్యోగులు, 15వేలమంది కాంట్రాక్టు ఉద్యోగులు ఈ సంస్థలో పని చేస్తున్నారు. ఇక దాదాపు 40వేల కుటుంబాలకు పరోక్షంగా ఈ పరిశ్రమ ఉపాధి కల్పిస్తోంది. అంతేకాదు రాష్ట్రానికి ఐదు దశాబ్దాల క్రితం ఏపీకి రావాల్సిన స్టీల్ ఇండస్ట్రీ తమిళనాడులోని సేలంకు తరలిపోయిన నేపథ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కేంద్రంపై తీవ్రంగా పోరాడి, కొందరు ప్రాణాలు సైతం త్యాగం చేశాక కేంద్రం ఏర్పాటు చేసిన సంస్థ ఇది. దీనికి స్థానిక రైతుల నుంచి వేలాది ఎకరాల భూములు సేకరించారు. వారిలో చాలామందికి ఇప్పటికీ పూర్తస్థాయి నష్ట పరిహారం అందనేలేదు. మూడు దశాబ్దాల క్రితం ఇది ఉత్పత్తి మొదలుపెట్టింది. ఇప్పుడు దీని విషయంలో కేంద్రం.. రాష్ట్రంపై కక్ష కట్టినట్టు వ్యవహరిస్తుండటం రాష్ట్ర ప్రజలు ఎంతమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. విభజన తరువాత రాష్ట్రం ఆర్థిక కష్టాలు ఎదుర్కొనాల్సిరావడం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోవడం వంటి పరిస్థితులు చవిచూస్తుంటే.. కేంద్రం వైఖరి మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందంగా ఉందన్న విమర్శలు వినవస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఉమ్మడిగా కేంద్రంపై పోరుబాట పడితేగానీ ఈ పరిశ్రమను కాపాడుకోవడం సాధ్యం కాదని ప్రజలనుంచి అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.