తూర్పులో ‘ఫ్యాన్స్’ ఆధిపత్య పోరు...ఫ్యాన్‌కు డ్యామేజ్ తప్పదా!
ఇక తూర్పు గోదావరి జిల్లాలో కూడా ఈ ఆధిపత్య పోరు ఎక్కువగానే ఉంది. పలు నియోజకవర్గాల్లో నేతలకు అసలు పడటం లేదు. ఒకోసారి నేతల మధ్య ఆధిపత్య పోరు బయటపడిన విషయం కూడా తెలిసిందే. అయితే ఈ పోరు వల్ల పార్టీకి డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గతంలో టీడీపీ అధికారంలో ఉండగా ఇలాగే పలు చోట్ల నేతల మధ్య రచ్చ నడిచింది.
దీని వల్ల పార్టీకి చాలా డ్యామేజ్ జరిగింది. ఇప్పుడు వైసీపీలో కూడా అలాంటి రచ్చే నడుస్తోంది. తూర్పు గోదావరి జిల్లాలో రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాలకు పెద్దగా పొసగదనే సంగతి తెలిసిందే. వీరి మధ్య ఒకసారి డైరక్ట్‌గా మాటల యుద్ధం కూడా నడిచింది. అప్పుడు అధిష్టానం పిలిచి క్లాస్ తీసుకోవడంతో కాస్త పరిస్తితి సద్దుమణిగింది.
కానీ అంతర్గతంగా వీరి మధ్య రచ్చ నడుస్తూనే ఉందని తెలుస్తోంది. అటు మండపేటలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్‌లకు పెద్దగా పడదనే సంగతి తెలిసిందే. మొదట నుంచి వీరు బద్ధశత్రువులుగా ఉన్నారు. వేరు వేరు పార్టీల్లో ఉండటంతో రాజకీయంగా ఒకరిపై ఒకరు పైచేయి సాధించడానికి చూశారు. కానీ ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్నా సరే..వీరికి పడటం లేదు. అటు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తీరుపై పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. ఇలా తూర్పులో ఫ్యాన్ నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది..మరి ఈ పోరు నెక్స్ట్ ఎన్నికల్లో వైసీపీకి డ్యామేజ్ చేస్తుందేమో చూడాలి.