కేసీఆర్ : తెలంగాణ జిల్లాల పర్యటనలో మార్పు.. ఎందుకో తెలుసా..?
ముఖ్యమంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్న తరుణంలో.. నూతనంగా నిర్మించిన మార్కెట్ యార్డ్, డబుల్ బెడ్రూం ఇండ్లు, వైద్యకళాశాల, నర్సింగ్ కళాశాల, కర్నెతండా ఎత్తిపోతల వేరుశనగ పరిశోధన కేంద్రం, గొర్రెల పునరుత్పత్తి కేంద్రం, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, నీటిపారుదల శాఖ సీఈ కార్యాలయానికి సీఎం శంకుస్థాపన చేయనున్నట్టు మంత్రి నిరంజన్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారు.
ఇదివరకు సీఎం కేసీఆర్ డిసెంబర్ 19న వనపర్తి జిల్లాలో, 20న జనగామ జిల్లాలో పర్యటించాలని భావించినా.. కానీ అది కాస్త వాయిదా పడింది. జనగామ జిల్లాలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు చేసి.. టీఆర్ఎస్ కార్యాలయాలను ప్రారంభించడంతో పాటు బహిరంగ సభలో పాల్గొంటారని ఇప్పటికే సీఎంఓ కార్యాలయం ప్రకటించింది. తాజాగా మార్పులు చోటు చేసుకోవడంతో.. ఇవాళ దళితబంధుతో పాటు పలు అంశాలపై కలెక్టర్లతో భేటీ అవ్వనున్నారు సీఎం. దళితబంధు సహా ఇతర అంశాలపై కూడా చర్చించనున్నారు. ఇవాళ ప్రగతిభవన్‌లో జరిగే సమావేశంలో మంత్రులు, సీఎస్ సోమేశ్‌కుమార్, సీనియర్ అధికారులు పాల్గొంటారు. వనపర్తి, వికారాబాద్, జనగాంతో పాటు త్వరలో పలు జిల్లాలలో నియోజకవర్గాలలో కూడా సీఎం పర్యటించనున్నారు.
మరోవైపు ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. త్వరలో ఖమ్మం జిల్లాకు ప్రత్యేక అభివృద్ధి ఫ్యాకేజీ కూడా ప్రకటించనున్నట్టు వెల్లడించారు. ఖమ్మం దత్తత జిల్లా అని, ఎన్ని కావాలంటే అన్ని నిధులను మంజూరు చేస్తానని.. సీతారామ ప్రాజెక్ట్‌ను వీలు అయినంత త్వరగా పూర్తి చేసుకుందామని చెప్పారు సీఎం. వివిధ అభివృద్ధి పనుల కోసం రూ.700 నుంచి రూ.800 కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్టు తెలిపారు. జిల్లా నాయకత్వమంతా కలిసికట్టుగా పని చేయాలని, చెడగొట్టే వాళ్ల గురించి పట్టించుకోవద్దని.. వాళ్లను పార్టీ కార్యక్రమాలకు పిలువవద్దని.. అలాంటి వారు పార్టీలో ఉంటే ఉంటారు.. పోతే పోతారని సీఎం కేసీఆర్ స్పష్టం చేసినట్టు సమాచారం.