హుర్రే..! ఆ ప్రభుత్వరంగంలో ఉద్యోగాలే ఉద్యోగాలు..?

Chakravarthi Kalyan
ప్రభుత్వ ఉద్యోగం సాధించడం చాలా మంది యువకుల కల. ఒక్కసారి ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందంటే..ఇక లైఫ్‌లో సెటిల్ అయినట్టే భావిస్తారు.. అందులోనూ కొన్ని ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగం దొరకడం చాలా అదృష్టంగా చెప్పుకుంటారు. అలాంటి వాటిలో ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా ఒకటి. వైట్ కాలర్ జాబ్‌.. చక్కటి పనివేళలు.. సెలవులు.. ఇలా ప్రభుత్వ బ్యాంకుల్లోని ఉద్యోగాల్లో ఇలా అన్ని సౌకర్యాలు ఉంటాయన్న పేరుంది.


అలాంటి బ్యాంకింగ్‌ రంగంలో బోలెడు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయట. ఈ విషయాన్ని కూడా ప్రభుత్వమే చెప్పింది. అది కూడా ఏకంగా పార్లమెంటులో.. అవును.. నిజమే.. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొత్తం 41,177 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. ఈ ఖాళీగా ఉన్న పోస్టులు.. అసలు మొత్తం బ్యాంకుల్లోని మొత్తం పోస్టుల్లో ఇది 5శాతంగా అంచనా వేస్తున్నారు. అసలు ఇండియా మొత్తంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో దాదాపు 8 లక్షలకు పైచిలుకు ఉద్యోగాలు ఉన్నాయి.


ఒక్క భారతీయ స్టేట్ బ్యాంకు అంటే ఎస్‌బీఐలోనే  8 వేలకుపైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయట.  ఇలా ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉండటం వల్ల.. ఇప్పటికే ఉన్న ఉద్యోగులపై ఒత్తిడి పెరిగిపోతోందట. ఈ అంశంపై లోక్‌సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రాతపూర్వకంగా జవాబిచ్చారు. ప్రస్తుతం 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయట. ఇందులో ఆఫీసర్‌, క్లర్క్‌, సబ్‌స్టాఫ్‌ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయట.


ఇక బ్యాంకుల వారీగా వస్తే.. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో 6,700 ఖాళీలు ఉన్నాయట. సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియాలో 6,200 ఖాళీలు ఉన్నాయి. అలాగే ఇండియన్‌ ఓవర్సీస్‌  బ్యాంక్‌లో 5,100.. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 4,800 ఉన్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్‌..  పార్లమెంటులోనే తెలిపారు. మరి ఇంకేం.. మీకు ఏమాత్రం ఆసక్తి ఉన్నా బ్యాంకింగ్ పరీక్షలపై దృష్టి పెట్టి బ్యాంకు ఉద్యోగం సాధించండి.. మీ సత్తా సగౌరవంగా చాటండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: