ఇస్రో టార్గెట్: ఇండియన్ ఫస్ట్ స్పేస్ స్టేషన్‌.. ఎప్పుడంటే..?

Chakravarthi Kalyan
అంతరిక్ష రంగంలో అద్భుతాలు ఆవిష్కరించే సంస్థ ఇస్రో.. భారత్‌కు ఉన్న పరిమిత వనరులతోనే అమెరికా, చైనా వంటి దేశాలతో పోటీ పడేందుకు ప్రయత్నిస్తున్న సంస్థ ఇస్రో. ఇప్పటికే కొన్ని దేశాలు సాధించిన అంతరిక్షంలోనికి మనిషిని పంపే సాంకేతికతను సాధించేందుకు ఇస్రో కొన్నేళ్లుగా ప్రయత్నిస్తోంది. గగన్ యాన్ పేరుతో ఈ ప్రాజెక్టును రూపొందించింది. భూస్థిర కక్ష్యలోకి మనుషులను తీసుకెళ్లి.. తిరిగి క్షేమంగా భూమికి రప్పించటం ఈ గగన్ యాన్ ప్రాజెక్టు లక్ష్యం. అయితే.. ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్నఈ మానవ సహిత ఉపగ్రహ ప్రాజెక్టు గగన్‌యాన్‌ కు అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. ఈ ప్రయోగానికి అవసరమైన యంత్ర పరికరాలు లాక్‌డౌన్‌ కారణంగా సమకూరలేదు.


దీంతో ఈ గగన్ యాన్ ప్రాజెక్టును ముందుగా అనుకున్న సమయంలో ప్రయోగం అసాధ్యమని ఇస్రో అధికారులు గతంలోనే ప్రకటించారు. అయితే.. మిగిలిన ఏర్పాట్లు మాత్రం పూర్తవుతున్నాయి. ఉపగ్రహంలో ప్రయాణించే నలుగురు భారత వ్యోమగాములు ఇప్పటికే రష్యాలోని జెనరిక్‌ స్పేస్‌ విభాగంలో ట్రయినింగ్ తీసుకున్నారు కూడా. ఈ ప్రయోగం కోసం ఇస్రో బాహుబలిగా పేరున్న జీఎస్‌ఎల్‌వీ ఎంకే-3 ను వాడనున్నారు. అయితే ఈ ప్రాజెక్టును ఎప్పుడు లాంచ్ చేస్తారన్న అంశంపై నిన్న మొన్నటి వరకూ క్లారిటీ లేదు.


దీనిపై తాజాగా కేంద్ర అంతరిక్ష మంత్రి జితేంద్ర సింగ్ పార్లమెంట్‌లో స్పష్టత ఇచ్చారు. 2023 నాటికి గగన్ యాన్ పూర్తి చేస్తామని ఆయన పార్లమెంటుకు తెలిపారు. అలాగే ఇస్రో రూపొందించబోతున్న ఇతర ప్రాజెక్టుల వివరాలను కూడా మంత్రి పార్లమెంటుకు తెలిపారు. 2023లోనే వీనల్ మిషన్‌, ఎల్‌-వన్ ఆదిత్య సోలార్‌, చంద్రయాన్ 2 ప్రయోగాలను కూడా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు కేంద్ర అంతరిక్ష మంత్రి జితేంద్ర సింగ్ వివరించారు. ఇక అతి కీలకమైన అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ నిర్మాణాన్ని 2030లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు మంత్రి పార్లమెంటుకు తెలిపారు. ఇస్రో తాను రూపొందించబోతున్న అన్ని ప్రయోగాలు విజయవంతం కావాలని ఆశిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: