మునక్కాయలకు కరువొచ్చింది.. ఎందుకో చూడండి

Deekshitha Reddy
ఇప్పటి వరకు మనం టమోటాలు, ఉల్లిపాయల రేట్లు భారీగా పెరిగిపోవడం చూశాం, తిట్టుకుంటూనే వాటిని కొని వాడుకుంటూనే ఉన్నాం. కానీ ఇప్పుడు ఊహించని విధంగా మునక్కాయలకు డిమాండ్ పెరిగిపోయింది. కర్నాటక మార్కెట్లో ఒక్కసారిగా మునక్కాయల ధరలకు రెక్కలొచ్చేశాయి. అక్కడ కిలో మునక్కాయలు ఏకంగా నాలుగు వందల రూపాయల ధర పలుకుతున్నాయంటే డిమాండ్ ఎంతగా ఉందో ఇట్టే అర్ధమయిపోతుంది. ఒక్కసారిగా మునక్కాయలకు ఇంతలా డిమాండ్ ఎందుకు పెరిగిందో ఎవరికీ అంతుచిక్కడం లేదు. అయితే తెలుగు రాష్ట్రాల్లో పెరటి చెట్టుగా ఉన్న మునగ చెట్టుకు ఇప్పుడప్పుడే అంత రేటు పలుకుతుందని ఆశించలేం కానీ.. కర్నాటకలో మాత్రం మునక్కాయ కొండెక్కి కూర్చుంది.
ఇటీవల కురిసిన కుండపోతవర్షలకు భారీగానే పంటనష్టం జరిగింది. దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. దీంతో కూరగాయల ధరలన్నీ డిమాండ్ అండ్ సప్లై సూత్రంతో అమాంతం పెరిగిపోయాయి. పైగా కార్తీక మాసం రావడంతో కూరగాయలకు డిమాండ్ మరింతగా పెరిగిపోయింది. మరోవైపు కరోనా కొత్త వేరియంట్ సాకుతో నాన్ వెజ్ తినడాన్ని కూడా చాలా మంది తగ్గించేశారు. ఈ నేపథ్యంలో సహజంగానే కూరగాయల ధరలు పెరుగుతాయి. అయితే ఇలా ఒక్కసారిగా కూరగాయల ధరలన్నీ ఆకాశాన్నంటడంతో వినియోగదారులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే కిలో టమాటో క్రికెట్ స్కోర్ మాదిరిగా వంద దాటి.. తన ప్రతాపాన్ని చూపింది. ప్రస్తుతానికి వందకు అటూఇటుగా ఉంటూ నేనే నెంబర్ వన్ అంటూ మిగతా కూరగాయలను వెక్కిరిస్తోంది.
ఇప్పటివరకూ ఇటీవల కూరగాయల్లో అధిక ధర అంటే టమాటోలనే చెప్పేవారు. అయితే ఇప్పుడు మునక్కాయలు కూడా టమాటో ధరల రికార్డును బద్దలుకొడుతున్నాయి. ఏకంగా కిలో నాలుగు వందలు పలుకుతోందంటేనే అర్ధం చేసుకోవచ్చు. కర్నాటకలో ప్రస్తుతానికి మునక్కాయలు పూణే నుంచి తీసుకు వస్తున్నారు. అయితే భారీ వర్షాలకు దిగుబడి రాకపోవడమే ధరల పెరుగుదలకు కారణమని తెలుస్తోంది. మరోవైపు పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో క్యాటరింగ్ నిర్వాహకులు ఎంత ధరైనా చెల్లించి మునక్కాయలు కొనుగోలు చేస్తున్నారట. దీంతో కర్నాటకలో మునక్కాయలను ముట్టుకుంటేనే షాక్ కొడుతోందని వినియోగదారులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: