ఆ ఎమ్మెల్యే అసైన్డ్ భూములను కబ్జా చేసారా..?
పేదల వద్ద నుంచి భూమిని కబ్జా చేయడం ఇప్పటి నుంచి కాదు.. తాతల తరాల నుంచి నిత్యం పేదల భూమి ఏదో ఒక రూపంలో కబ్జాకు గురవుతూనే ఉన్నది. రాజుల కాలంలో.. రాజకీయ నాయకుల కాలంలో ఇలా ఎవరిక హయంలోనైనా బలయ్యేది పేదలే. పేదల భూమి కబ్జా చేస్తే అడిగి వాడు ఎవ్వడు ఉండడనే ధైర్యంతోనే ధనవంతులు పాత కాలంలోనైతే రాజులు.. ప్రస్తుతం రాజకీయ నాయకులు సర్పంచ్ కానుంచి మంత్రుల వరకు సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, ఎమ్మెల్యే, జడ్పీచైర్మన్, మంత్రి ఇలా ప్రతీ ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో పేదలకు చెందిన భూములను కబ్జా చేసేందుకు యత్నిస్తూనే ఉన్నారు.
ఓ వైపు ధర వస్తుందని అధికారంలో ఉన్న నేతలు ముందే తెలుసుకుని ఏదో ఒక విధంగా తన అనుచరులతో డబ్బు ఎరవేసి పేదల నుంచి భూమి కాజేస్తున్నారు. ఇలా మాజీ మంత్రి, తాజా హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కూడా కబ్జా చేసినట్టు ఇప్పటికే పలు ఆరోపణలు వినిపించిన విషయం విధితమే. అయితే తాజాగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు పెద్ద షాక్ తగిలింది. ముఖ్యంగా ఈటల కుటుంబానికి చెందిన జమునా హేచరీస్ అసైన్డ్ భూములను కబ్జా చేసిన విషయం వాస్తవమే అని మెదక్ కలెక్టర్ హరీశ్ వెల్లడించారు. మొత్తం 70.33 ఎకరాల భూమిని ఎమ్మెల్యే కబ్జా చేశారని చేపట్టిన సర్వేలో తేలిందని వివరించారు కలెక్టర్. ఈటల భూముల అంశంపై కలెక్టర్ మీడియాతో మాట్లాడి 56 మంది అసైన్డ్ భూములను కబ్జా చేసినట్టు వెల్లడించారు. ముఖ్యంగా అచ్చంపేట, హకీంపేట పరిధిలో అసైన్డ్ భూములను వ్యవసాయేతర భూములను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఈటల. మరోవైపు వాల్టా చట్టాన్ని కూడా ఉల్లంఘించి అటవీ ప్రాంతంలో చెట్లు నరికి, రోడ్లు వేసారు అని నిర్థారణ అయింది.
ఫౌల్ట్రీ నుంచి కాలుష్యం వెదజల్లుతుందని అధికారులు గుర్తించారు. ఈ అసైన్డ్ భూముల కబ్జా, అక్రమ నిర్మాణాలపై అధికారులు ఓ నివేదిక కూడా పంపారట. అదేవిధంగా అక్రమాలకు పాల్పడిన మంత్రి అయినా.. ఎమ్మెల్యే అయినా ఇలా ఎవరు అయిన సరే.. వారికి సహకరించిన అధికారులపై కూడా చర్యలు తీసుకుంటాం అని కలెక్టర్లు సైతం వెల్లడిస్తున్నారు. బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వానికి నివేదికలు కూడా అందజేస్తున్నట్టు పేర్కొంటున్నారు. ఇలా ఓ ఎమ్మెల్యే తతంగం వెలుగులోకి వచ్చింది. ఇంకా పేదల భూములను కబ్జా చేసి బెదిరింపులకు పాల్పడి గుట్టుగా భూమిని కాజేస్తున్న వారు ఎందరో ఉన్నట్టు సమాచారం.