వాన గండంతో ఉత్తరాంధ్ర గజగజ.. ప్రభుత్వం అలర్ట్..!

NAGARJUNA NAKKA
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. విశాఖకు 960కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ వాయుగుండం నేడు జవాద్ తుపానుగా మారనుంది. ఇది శనివారం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలను తాకనుంది. దీని ప్రభావంతో రెండు రోజుల పాటు ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ రోజు అర్ధరాత్రి నుంచి తీరం వెంబడి ఈదురు గాలులు వీస్తాయి. మత్స్యకారులు సోమవారం వరకు వేటకు వెళ్లొద్దు. తుపాను కారణంగా 95రైళ్లు రద్దయ్యాయి.
జవాద్ తుపాను కారణంగా విజయనగరం జిల్లాలో పాఠశాలలకు సెలవులు ఇస్తున్నట్టు కలెక్టర్ ప్రకటించారు. భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున డిసెంబర్, 4 తేదీల్లో స్కూళ్లకు సెలవులు ఉంటాయని తెలిపారు. ఆ తర్వాత పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మిగతా జిల్లాల్లో సెలవులపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇక ఈ రోజు, రేపు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముంది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ కమిషనర్ కన్నబాబు తెలిపారు.
మరోవైపు జవాద్ తుపాను కారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు రద్దు చేస్తున్నట్టు విశాఖ జిల్లా కలెక్టర్ తెలిపారు. గ్రామస్థాయి నుంచి జిల్లా అధికారి వరకు అందరూ విధులకు హాజరుకావాలని ఆదేశించారు. అలాగే మూడు రోజుల పాటు విశాఖలో పర్యాటక ప్రదేశాలు మూసేస్తున్నారు. రేపు, ఎల్లుండి ఉత్తారంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముంది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి అవంతి తెలిపారు.
విజయనగరం జిల్లా భోగాపురం దగ్గర సముద్రం వెనక్కి వెళ్లడం ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా తుపాను సమయాల్లో సముద్రం ముందుకు వస్తుంటుంది. ఇందుకు భిన్నంగా భోగాపురం మండలం ముక్కాం గ్రామం దగ్గర కడలి 100మీటర్లు వెనక్కి వెళ్లింది. ఇది గమనించిన మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. పౌర్ణమి, అమావాస్యల సమయాల్లోనే ఈ విధంగా జరుగుతుంటుందని.. తుఫాన్ సమయంలో ఇలా జరగడం ఇదే తొలిసారంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: