వెల 'సిరి' : కవితామృతాన్ని పుష్కలంగా నింపుకున్న నిండుకుండ ‘సిరివెన్నెల’

చుట్టూ పక్కల చూడరా చిన్నవాడా
చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా
కళ్ళముందు కటిక నిజం
కానలేని గుడ్డి జపం
సాధించదు ఏ పరమార్థం
బ్రతుకుని కానీయకు వ్యర్థం.... అంటూ సాగే పల్లవి.. ఈ సినీ గీతం  ప్రముఖ నటుడు  తొలిసారిగా చిత్ర నిర్మాతగా నిర్మించిన చిత్రం రుద్రవీణ లోనిది.  ఈ చిత్రం ఆరంభం ఇలా సాగుతుంది..ఒక చిన్న పిల్లవాడు కోనేటిలోని పవిత్ర గంగలో కాళ్ళు తడుపుకుని గుడిలోపలకి వెళ్తుంటాడు. గుడి మెట్లమీద  అంధురాలు, వృద్ధురాలైన ఓ బిచ్చగత్తె “ధర్మం చెయ్యండి బాబూ” అంటుంది, అటుగా వెళ్ళే ఓ పూజారి ఓ అరటి పండామె ఆమె ముందుపెట్టి వెళ్ళిపోతాడు. ఆమె ఆ అరటిపండుకై తడుముకుంటుంటే అది  కాస్తా కింది మెట్టుమీదకు జారి పడిపోతుంది. ఇది ఆ పిల్లవాడు చూస్తూనే ఆమెకు ఆ పండు అందించి సాయపడకుండ మంత్రాలు జపించుకుంటూ వెళ్ళిపోతాడు. మరో వైపు నుంచి ఇదంతా గమనిస్తున్న మరో బిచ్చగాడు  లేచి వెళ్ళి ఆ పండు తీసి ఆమె చేతిలో పెడతాడు. అక్కడితో ఆగిపోకుండా... ఆ పిల్లవాడిని  పిలిచి ఇలా అడుగుతాడు.
“ఆగు బాబూ, నీ పేరేంటి?
పిల్లవాడు మనసులో మంత్రాలు జపిస్తూ నిలబడతాడు
“మంత్రాలు జపిస్తున్నావా?”
అవును అన్నట్టు  ఆ పిల్లాడు తలూపుతాడు.
“ఆ గుడ్డి ముసలి దాని అవస్థ చూశావుకదా?”
జపించడం ఆపకుండ అవును అని తలూపుతాడు.
“తోటి మనిషికి సహాయం చెయ్యకూడదని మంత్రాలు చెప్తున్నాయా?”
కాదని తలూపుతాడు.
“జీవాత్మే పరమాత్మ అని దేవుడే చెప్పాడు కదయ్యా? కుర్రవాడివికదా? నీకు తెలీదు. కానీ విను. దేవుడు నీకిచ్చిన రెండు చేతుల్లో ఒకటి నీకోసం, రెండోది పక్కవాడి చేయూతకోసం”.... అంటూ చెబుతాడు.
దీంతో ఆ పిల్లాడు అదే ఆలోచనలతో దేవాలయం లోనికి వెళతాడు. గుడి వెలుపల బిచ్చగాడు చెప్పిన మాటలను తనదైన శైలిలో విస్తరించి ఓ పాట పాడుతాడు. ఒక వ్యక్తి నుంచి వెలవడిన మాటలు,  జీవిత చక్రాన్ని మార్చేస్తాయనడానికి ఓ చిన్న ఉదాహరణ  పైన పేర్కోన్న సందర్భం.  సందర్భాన్ని అనుసరించి  పాటలు రాయడం సిరివెన్నెల సీతారామ శాస్త్రి సొంతం. గుడి, మడి, పూజలు, పునస్కారాలూ, వేదపారాయణాలూ, మంత్ర జపాలతోనే పరమార్థం దొరకదు. నీ చుట్టూ ఉన్న ప్రతి మనిషిలోనూ పరమాత్మ ఉన్నాడు, ఆ జీవులకి నువ్వు చెయ్యగలిన ఏ సేవ చేసినాకూడా అదీ మంత్రజపమే, వేదపారాయణమే అని ప్రతీకాత్మకంగా  సీతారామ శాస్త్రి ఈ పాటలో వివరించారు. జీవిత పరమార్దాన్ని వివరించారు.
సినిమా పాటల్ని చిన్నచూపు చూడనక్కర్లేదు. సినిమా పాటల్లో కూడా ఎప్పటికప్పుడు కవిత్వాన్ని చిలకరించవచ్చు అని నిరూపించిన సాహితీ వేత్త సిరివెన్నెల.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: