బాబోయ్.. టమాటా మోత ఇంకో 2 నెలలు..?

Chakravarthi Kalyan
టమాటా.. ఇప్పుడు వంటింట్లో భూకంపం సృష్టిస్తున్న పండు ఇది. టమాటాల ధర ఒక్కసారిగా పదుల నుంచి వందల్లోకి వెళ్లింది. కొన్ని చోట్ల కేజీ టమాటా 150 రూపాయలు పలుకుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. టమాటా ధరల్లో ఇలాంటి వ్యత్యాసాలు గతంలో ఉన్నా.. మరీ ఈ రేంజ్‌లో ధరలు పెరగలేదు. పంట బాగా వచ్చే సమయంలో కేజీకి 2, 3రూపాయలు కూడా ధర రాక మార్కెట్లలోనే టమాటాలు పారబోసిన దృశ్యాలు పేపర్లలో చూస్తూనే ఉంటాయి. కానీ ఇప్పుడు అదే టమాటా రూ. 120 – 150 వరకూ పలుకుతోంది.

అయితే.. ఇప్పుడు ఇంకో బ్యాడ్ న్యూస్ వినిపిస్తోంది. ఈ టమాటా సంక్షోభం మరో రెండు నెలల పాటు ఉంటుందని తెలుస్తోంది. దేశంలో టమాటాల ధరలు....మరో 2నెలలు ఇలాగే ఉంటాయని క్రిసిల్‌ రీసెర్చ్‌  సంస్థ చెబుతోంది. కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షాలతో పంట దెబ్బతినడంతో ధరల మోత మోగుతోందని ఆ సంస్థ వెల్లడించింది. సాధారణంగా అక్టోబరు-డిసెంబరు మధ్యకాలంలో టమాట దిగుబడి అధికంగా ఉంటుంది. టమాటా ఎక్కువగా పండించే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్రను ఇటీవల భారీ వర్షాలు ముంచెత్తాయి.

ఈ భారీ వర్షాలతో టమాట పంటలు దెబ్బతిన్నాయి. అందుకే టమాట ధరలు రికార్డుస్థాయిలో పెరిగాయని క్రిసిల్‌ రీసర్చ్‌ చెబుతోంది. అయితే..  మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లో టమాట పంట జనవరి వరకూ వస్తుంది. అప్పటి వరకూ ధరల్లో మార్పు ఉండదని క్రిసిల్ సంస్థ చెబుతోంది. కొత్తపంట మార్కెట్లోకి రావడం మొదలైతే ధరలు 30శాతం వరకు తగ్గుతాయని ఈ సంస్థ చెబుతోంది.

టమాటాతో పాటు ఉల్లి ధరలకూ రెక్కలు వస్తున్నాయి. అయితే.. మహారాష్ట్రలో తక్కువ వర్షపాతం వల్ల ఉల్లిపంటలు వేయడం ఆలస్యమైందట. అందుకే సెప్టెంబరుతో పోలిస్తే గతనెలలో ఉల్లిధరలు 65శాతం పెరిగాయట. 10-15 రోజుల్లో హరియాణా నుంచి ఉల్లి పంట మార్కెట్లోకి వస్తుందని, అప్పుడు ధరలు తగ్గుతాయని క్రిసిల్ సంస్థ చెబుతోంది. మొత్తానికి టమాటా, ఉల్లి ధరలు వంటింటి బడ్జెట్‌ను అతలాకుతలం చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: