ఆర్ఆర్ఆర్ : రియల్ జననిని చూశాను సర్..!
మట్టి నుంచి వికసించి ఉండాలి
మనిషి అన్న పదం
ఏ గర్భశోకానికో అంతమయి ఉండాలి
అవును! నేను వింటున్నానొక పాట
నేను చూస్తున్నానొక జీవితం
పాట పరిసమాప్తి కాదు
ఉషఃకాంతి..జీవితం పరిసమాప్తి కాదు
అదొక దుఃఖానికి ఎడబాటు లేదు
మీ సంకల్పానికో తోడు..
జననీ వింటున్నానీ పాట
పావనీ మీ జీవితం గురించి తెలుసుకుంటున్నానో చోట
తారక రాముడు నచ్చాడు.. సుప్రభాత సంకీర్తనా స్రవంతి
ఈ దేశ చరిత.. మట్టి దాచుకుంటే పునీతం
మనిషి దాచుకుంటే నిర్విరామం..
జే గంటలు మోగుతున్న వేళ వినిపిస్తున్న శంఖారావం
నా దేశం. ఈ నేల మరియు ఓ మనిషి..
పడి లేచిన మనిషి బంగరు కలలకు మెరుగులు దిద్ది
మంచి దారుల్లో నడుస్తాడు.. భారతదేశానికి రైతు ఓ వెలుగు
అఖండ జ్యోతి.. జననీ నీ చెంత ఈ విద్యుల్లతలే మావి!
తల్లీ నీకు వందనం.. వీరులను ఇచ్చిన తల్లులకు పాదాభివందనం
నేను చేస్తున్నాను మీరూ చేయండి..
దేహ దాతువుల్లో నిద్రాణం అయిన అహాన్ని తట్టి లేపండి
ప్రవాహంలో కాంతులను లయం చేసి ఆ సందర్భాల్లో
కలలకు కాసిన్ని దారులు చూపించండి నిజం అవుతాయి
దుర్గమమయిన దారిని శాబ్దికం చేశాక ఒక చరిత నేపథ్యం
ఒక జీవితం అంతిమం
దేశానికి ఇకపై కొన్ని శక్తుల అండ ఉండాలి. సంగ్రామం మొదలయిన దగ్గర నుంచి సంగ్రామం ముగిసేవరకూ మనం ఒకింత శ్రద్ధ వహించాలి. దారంతా తల్లుల ఆర్తనాదాలు విని ఆగిపోయిన మనుషులే ఈ స్వేచ్ఛాగీతికలకు నేపథ్యాలు. జననీ నీకు వందనం అని చెప్పడం ఎంత సులువు. ఏమయినా సులువే ప్రాణాలు నిలబెట్టే క్రమంలో ప్రాణం పోసుకునే క్రమంలో మరో చరిత్రకు నాంది కావడం అన్నది సంక్లిష్టం. నేల తల్లిని నమ్ముకున్న బిడ్డలను చూస్తూ నడవడి వింటూ పొంగిపోయాను నేను. ఆ కుటుంబానికి ఈ పాటకు ఏ బంధం ఉందో తెలియదు. ప్రతిరోజూ మనం ప్రాణం పోసుకున్న స్వరాలం.. ప్రతిరోజూ మట్టి గీతికలను ఒంటికి పూసుకున్న దేహాలం..అయినా కూడా కొన్నంటే కొన్ని మనల్ని కదలించగ వస్తాయి. ప్రాణ స్పందనలకు ఆయువు ఇచ్చి వెళ్తాయి. దేశం త్యాగం అన్నవి వేరువేరుగా ఉన్నప్పుడు మనిషి ఓడిపోయాడు. ఒక్కటయినప్పుడు చరిత్రగా మారాడు..జ్వలించు అక్షరం అయ్యాడు అని రాయాలి నీవు. మట్టి మాత్రమే దాచుకున్న ఓ గొప్ప జీవితం మనం మననం చేసుకుంటే రేపటికి అది తేజం అవుతుంది ఉదయం అవుతుంది అస్తమించని ప్రాభావిక తేజం అవుతుంది అని రాయాలి. ఆ వర్ణాన్ని పూసుకుంటే కౌలు రైతుల బిడ్డలు కానగవస్తారు. రైతు బిడ్డలు కానగవస్తారు. మా నాన్న ఈ దేశం భవిష్యత్తు అని చెప్పే ఓ ఉపదేశ సారం వినిపించి వెళ్లడం వారి బాధ్యత. ఆదరించడం అన్నం పెట్టేవారికి కృతజ్ఞతలు చెల్లించడం బాధ్యత. అవును బాధ్యత మరిచి ఏమయినా రాశావా నువ్వు!
పంటలు పోయి ఏడుస్తున్న రైతు ప్రాణం పోయి ఏడుస్తున్న సైనికుడి భార్య ఇద్దరూ ఇవాళ స్మరణకు తూగుతున్నారు. అంతటి స్థాయిలో ఒక యాంథమ్ రాసి ప్లే చేశారు కీరవాణి. ఒక చరిత సుప్రభాతం అవుతుందని చెప్పారు. అలాంటి జననిని చూశాను. ఉప్పొంగిపోయాను. ఒక కౌలు రైతు కుటుంబం ఎలా ఎదిగివచ్చిందో తారక్ పరిచయం చేస్తున్నారు. ఎవరు మీలో కోటీశ్వరుడు అంటూ.. తాను నిర్వహించే ప్రొగ్రాంలో! ముగ్గురు బిడ్డల కుటుంబం. తల్లి ఓ వ్యవసాయ కూలి. నాన్న ఓ కౌలు రైతు. ఏడెకరాల పొలానికి కౌలు చెల్లించాలి. మిర్చి పంట వేశారు రాలేదు. కష్టం అయింది. అన్నయ్య ఆ కష్టాన్ని నెత్తిన పెట్టుకుని చెల్లాయిని చదివించాడు. చెల్లాయి పావని ఆమెనే ఆ ప్రొగ్రాం కంటెస్టెంట్.. మరో చెల్లాయినీ చదివించాడు. ఒక చెల్లాయి ఎం ఫార్మసీ మరో చెల్లాయి బీటెక్.. అన్నయ్య ఎంబీఏ రెండో ఏడాది చదువును మధ్యలోనే వదిలి కుటుంబ బాధ్యతను నెత్తికెత్తుకున్నాడు. అమ్మా నాన్న ఇలా అంతా కుటుంబాన్ని ఆ బిడ్డలకు ఆదర్శంగా మలిచారు. ఇప్పుడీ జనని పావని..వందనాలు చెల్లించండి.. ఈ జనని మన జీవితాల్లో ఓ స్ఫూర్తి ప్రదాయిని.. మనిషి దుఃఖం దాటిన ప్రతిసారీ గెలిచి వచ్చాడు.. నేల దుఃఖాన్ని జయించిన ప్రతిసారీ గొప్ప చరిత్రకు ఆనవాలు అయింది. మనం దాటాల్సిన నదులు జీవితాలే! మనం జయించాల్సిన సముద్రం ఎక్కడో లేదు మనలోనే! అలాంటి తల్లులకు సుప్రభాత సాంధ్య రాగాలు వినిపించే చరితలకు వందనాలు చెల్లించాలి. ఆర్ఆర్ఆర్ సినిమా ఆ పని చేస్తుంది. తారక్ ఆ పనిచేస్తారు. ఇంకా ఇంకొందరు. ఎప్పుడో ఆకాశవాణిలో విన్న ట్యూన్ లో పాట రాస్తే ఎలా ఉంటుంది.. అలా ఒక నడవడి ఈ జనని.. పాటకూ పావని జీవితానికి ఎంతో బంధం ఉంది.. పాట గత కాలానికి పావని మనందరి వర్తమానం
రెండూ కలిపి చూస్తే రేపు మీ మరియు నా దేశ భవిష్యత్తు.. ఈ దేశ రైతు భవిష్యత్తు రైతు బిడ్డల భవిష్యత్తు కళ్లముందు కదలాడడం ఖాయం. మీరు ఈ నేలకు మోకరిల్లండి నేను మీకు మోకరిల్లుతాను..
- రత్నకిశోర్ శంభుమహంతి