నువ్వు లేని లోకంలో ఉండలేను.. నీతో వచ్చేస్తున్నా?

praveen
ఆమె ఓ యువకుడిని ప్రేమించింది.. పెద్దలను ఒప్పించి మరీ ప్రేమ వివాహం చేసుకుంది. వారి ప్రేమకు గుర్తుగా ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తనే ప్రాణంగా ఆ ఇల్లాలు జీవితాన్ని సాగిస్తూ వచ్చింది. వారి కుటుంబం మొత్తం వచ్చిన దాంట్లో సర్దుకుపోతూ ఎంతో సంతోషంగా జీవిస్తోంది. కానీ ఇంతలో విధి వారితో సంతోషాన్ని చూసి ఓర్వలేక పోయింది. సంతోషంగా సాగిపోతున్న వారి జీవితాలలో పెను విషాదాన్ని నింపింది. ఏకంగా కుటుంబ పెద్దగా కొనసాగుతున్న రమేష్ అనారోగ్యం బారిన పడ్డాడు. కొన్నాళ్లలోనే  మంచం పట్టి చివరికి ప్రాణాలు వదిలాడు. దీంతో ఆ ఇంట్లో పెను విషాదం చోటు చేసుకుంది.

  భర్త ప్రాణాలు కోల్పోయిన కొన్ని రోజుల వ్యవధిలోనే మరో విషాదకర ఘటన ఆ ఇంటిని శోకసంద్రంలో ముంచేసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త దూరం కావడాన్ని ఆ భార్య జీర్ణించుకోలేక పోయింది.. భర్త లేని జీవితాన్ని ఊహించుకోలేకపోయింది. ఇక నువ్వు లేని ఈ లోకంలో నేను ఉండలేను అంటూ బలవన్మరణానికి పాల్పడింది. ప్రేమకు గుర్తుగా పుట్టిన ఇద్దరు పిల్లల గురించి ఆలోచించకుండా ఆ తల్లి బలవన్మరణానికి పాల్పడటంతో ఇద్దరు పిల్లలు అనాధలుగా మారిపోయారు. ఈ ఘటన మెదక్ జిల్లా చిన్న శంకరంపేట్ లో చోటుచేసుకుంది.. శంకరంపేట కు చెందిన మహేశ్వరి అదే గ్రామానికి చెందిన చిరువ్యాపారి రమేష్ను ఎనిమిదేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకోగా వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

 ఇక కుటుంబం మొత్తం సంతోషంగా ఉంది అనుకుంటున్న సమయంలో ఊహించని విధంగా రమేష్ అనారోగ్యం బారిన పడి రోజుల వ్యవధిలోనే మృతి చెందాడు. భర్త మృతితో భార్య మహేశ్వరి ఎంతగానో మానసికంగా కుంగి పోయింది. భర్తను తలుచుకుని బోరున విలపిస్తూ ఉండేది. అయితే ఇటీవలే ఉదయం సమయంలో నిద్ర లేచి రోజు మాదిరిగానే పాలు తీసుకురావడానికి వెళ్ళింది మహేశ్వరి. కానీ ఎంతకీ తిరిగి రాలేదు. దీంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాలలో వెతికారు. అయితే చెరువు వైపు మహేశ్వరి వెళ్లినట్లు స్థానికులు చెప్పడంతో అక్కడికి వెళ్లి చూడగా మహేశ్వరి స్కూటీ తో పాటు పలు వస్తువులు చెరువు గట్టుపై కనిపించాయి. దీంతో ఈతగాళ్లు చెరువులో  వెతికి చూడగా మహేశ్వరి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే మహేశ్వరి మృతితో ఇద్దరు పిల్లలు అనాథలుగా  మారి పోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: