పిడుగులాంటి వార్త..! ఏపీలోని ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన..!
కడప జిల్లాలో వరద ఉధృతి కొనసాగుతోంది. పాపాగ్ని నదికి వరద పోటెత్తడంతో కమలాపురంలో బ్రిడ్జ్ కుప్పకూలింది. వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ బ్రిడ్జ్ కూలడంతో కడప-కమలాపురం మధ్య రాకపోకలు నిలిచిపోగా.. ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని పోలీసులు సూచించారు.
అంతేకాదు చెన్నై-కోల్ కతా హైవేపై నెల్లూరు సమీపంలో శివారులో పెన్నానది దగ్గర జాతీయ రహదారికి గండి పడగా.. నెల్లూరు-విజయవాడ మధ్యరాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వరద ఉధృతి కారణంగా నెల్లూరు జిల్లాలో పలు చోట్ల రైల్వే ట్రాక్ లు దెబ్బతిన్నాయి. తిరుపతి, చెన్నై నుంచి విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. చేసేదిలేక నెల్లూరు-పడుగుపాడు మధ్య రైలు ట్రాక్ పై నడుచుకుంటూ చాలా మంది పిల్లలతో సహా స్వస్థలాలకు వెళ్తున్నారు. ఈ ఘటనలు చూసి చాలా మంది కరోనా లాక్ డౌన్ సమయం నాటి పరిస్థితిని గుర్తు చేసుకుంటున్నారు.
తిరుపతి నగరంలోని వరద ప్రాంతాల్లో స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పర్యటించారు. నష్టంపై అంచనా వేసేందుకు అధికారులు త్వరలో సర్వే నిర్వహిస్తారని.. బాధితులు తప్పకుండా ప్రభుత్వ సాయం అందుతుందని భరోసా ఇచ్చారు. ఆధ్యాత్మిక నగరిని వరద ముంచెత్తిందన్నారు. దాదాపు 40వేల మంది ప్రజలకు అసౌకర్యం కలుగుతోందనీ.. మేయర్,కార్పొరేటర్లు 24గంటలు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేస్తున్నారని అభినందించారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో ఏపీ ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. లేకపోతే భారీ నష్టాన్ని చవిచూసే అవకాశముంది.