సండే స్కోప్ : పక్కపక్కనే రెండు విరుద్ధతలు!
తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా కేసీఆర్ కు పేరు. కాంగ్రెస్ ను భూస్థాపితం చేసిన వారిగా కేసీఆర్ కూ, జగన్ కూ పేరు. ఆ రోజు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి జగన్ సొంత పార్టీతో ముందుకు పోయి ఆత్మ గౌరవ నినాదం వినిపించారు. అదే విధంగా ఆయన అనుకు న్నది సాధించారు. అంతకుమునుపు కేసీఆర్ కూడా టీడీపీ నుంచి బయటకు వచ్చి తెలంగాణ రాష్ట్ర సమితి పేరిట సొంత పార్టీ స్థా పించి జెండా రూపకల్పన చేసి ప్రత్యేక తెలంగాణను ఆవిర్భవింప జేశారు. ఇద్దరూ ఢిల్లీ రాజకీయాలపై ప్రేమ ఉన్న వారే కనుక రెం డు జాతీయ పార్టీలతోనూ మంచి బంధాలే నెలకొల్పారు. సాగించారు కూడా! ఇవాళ్టికీ కేసీఆర్ కూ ఢిల్లీ అంటే ప్రేమే..ఇదే రీతిలో జగన్ ఉండరు కానీ తన బదులు మిథున్ (పూర్తిపేరు పి.వి.మిథున్ రెడ్డి, రాజంపేట ఎంపీ) ను మాత్రం ప్రోత్సహిస్తారు. ఎందుకంటే అవినాశ్ రెడ్డి అనే కడప ఎంపీకి ఇంకా పరిణామాలపై పట్టు లేదు కనుక! ఇక ఇద్దరికీ ఉన్న పోలికలేంటంటే కొన్ని విషయాలలో బీజేపీ అడగకపోయినా అత్యుత్సాహంతో సాయం చేయడం.. వత్తాసు పలకడం.. కానీ రాష్ట్ర ప్రభుత్వాలను నడిపే రీతిలో మాత్రం కేసీఆర్ కాస్త పట్టుదలగానే ఉంటారు. అడ్మిన్ పరంగా ఈ ఇద్దరూ కూడా ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో!
వీళ్లిద్దరూ చంద్రబాబు మాదిరిగా అధికారులను పరుగులు పెట్టించేంత సత్తా ఉన్న వారు అయితే కాదు. ఎన్నికల సమయం సమీపిస్తే చాలు యంత్రాంగాన్ని బాగా ప్రసన్నం చేసుకునే పనిలో కేసీఆర్ ఉంటారన్న ఆరోపణలు వినిపిస్తుంటాయి.ఇక జగన్ అయితే ఇవాళ్టికీ యంత్రాంగంపై అస్సలు పట్టు అన్నది తెచ్చుకోలేకపోయారు అన్నది బలీయమైన వాదన ఒకటి తన గురించి బయట వినిపించేలా చేస్తున్నారు లేదా ప్రవర్తిస్తున్నారు. కొన్ని విషయాల్లో కేసీఆర్ రాజకీయ పరిణితి కారణంగానే నెగ్గుకు వచ్చారు. కానీ జగన్ కు ఇంకా ఆ పరిణితి లేదు ఇకపై వస్తుందన్న నమ్మకం కూడా లేదు. ఓ విధంగా విరుద్ధ స్వభావాలు ఉన్న నేతలే అయినప్పటికీ రాజశేఖర్ రెడ్డి అంత పరిణితి ఉన్న నేతలు అయితే వీరు కూడా కాదు. అలానే చంద్రబాబుకు ఉన్న చాకచక్యం వీరికి కూడా లేదు గాక లేదు.
ఓ విధంగా రాజశేఖర్ రెడ్డి సొంత మనుషులకు మంచి విలువ ఇస్తారు. జగన్ ఇవ్వరు. ఇక చంద్రబాబు గూటి నుంచి వచ్చిన కేసీఆర్ ఎప్పుడు ఎవరిని ఎలా అవమానించి సాగనంపుతారో ఇవాళ్టికీ ఎవ్వరికీ అంతు పట్టదు గాక పట్టదు. ఇక ఉచిత పథకాల వర్తింపు అమలులో కేసీఆర్ కాస్త వెనకడుగు వేస్తుంటారు కానీ జగన్ మాత్రం తన ధ్యేయం లక్ష కోట్లు పంచడమే అని బాహాటంగా సంక్షేమ రీతుల గురించి చెబుతుంటారు. ఆఖరుగా భాష విషయంలో కేసీఆర్ గ్రేట్ ఇప్పటికీ ఎప్పటికీ..జగన్ కు ఇవాళ్టికీ తడబాటే! ఆ విషయమై ఇంకా చెప్పాలంటే సాహిత్య రీతులు చెప్పే విషయమై కేసీఆర్ ఎప్పటికీ ముందంజలోనే ఉంటారు. జగన్ కు ఓ నివాళి ప్రకటన కూడా వెలువరించడం రాదు అన్నది ఓ చేదు నిజం.