రావెల మళ్ళీ రూట్ మారుస్తారా?
దాదాపు ఈ రెండు పార్టీల పొత్తు ఖాయమే అని విశ్లేషణలు వస్తున్నాయి. ఇక ఈ పొత్తు ఖరారైతే దాని బట్టి కొందరు నాయకులు రాజకీయంగా ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా బీజేపీలో ఉన్న కొందరు నేతలు...టీడీపీ-జనసేనల పొత్తు ఉంటే అటు జంప్ చేసేందుకు చూస్తున్నారు. ఇప్పటికే టీడీపీతో పొత్తు ఉండదని బీజేపీ తేల్చి చెప్పేసింది...కాబట్టి బీజేపీ ఒంటరిగానే పోటీ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే జనసేన, టీడీపీతో ముందుకెళుతుంది.
అదే జరిగితే గత ఎన్నికల తర్వాత బీజేపీలోకి జంప్ కొట్టిన నేతలు తిరిగి టీడీపీ లేదా జనసేనలో చేరే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, బీజేపీని వీడి టీడీపీ లేదా జనసేనలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే రావెల ఆ రెండు పార్టీల్లో పనిచేశారు.
2014 ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసి ప్రత్తిపాడు నుంచి గెలిచారు. అలాగే చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. అయితే ఆరోపణలు రావడంతో మధ్యలోనే మంత్రి పదవి పోయింది. ఆ తర్వాత ఎమ్మెల్యేగా కొనసాగారు. 2019 ఎన్నికల ముందు టీడీపీని వీడి జనసేనలో చేరి...ప్రత్తిపాడు నుంచి పోటీ చేశారు. అలాగే 26 వేల ఓట్లు తెచ్చుకుని మూడోస్థానానికి పరిమితం అయ్యారు. అయితే ఈ సారి బీజేపీ నుంచి పోటీ చేస్తే ప్రత్తిపాడులో డిపాజిట్లు కూడా రావు. అందుకే రావెల..టీడీపీ లేదా జనసేనలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. పొత్తులో ప్రత్తిపాడు సీటు ఏ పార్టీకి దక్కుతుందో ఆ పార్టీలోకి వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. పొత్తు లేకపోయిన రావెల బీజేపీలో ఉండటం కష్టమే అని చెప్పొచ్చు.