జగనన్న : విభజన హామీలా? అవెక్కడ?
విభజన చట్టంలోని హామీలన్నీ నెరవేర్చాలని సదరన్ స్టేట్స్ కు చెందిన సీఎంల మీటింగ్ లో చెప్పారు జగన్. దీనిని చెప్పడమే అని రాయాలి డిమాండ్ చేశారు అని రాయకూడదు. ఎందుకంటే ఇప్పటివరకూ సీఎం జగన్ ఏ విషయంలో కూడా కేంద్రాన్ని పట్టుబట్టింది లేదు. అడిగి మరీ నిధులు రాబట్టుకున్నదీ లేదు. ముఖ్యంగా విభజన చట్టం అమలులో ఇప్పటికే కేంద్రంతో తగువులు ఉన్నా కూడా వాటిపై కూడా పెద్దగా మాట్లాడి గెలిచిందీ లేదు. పోనీ పొరుగు తెలుగు రాష్ట్రంతో కలిసి విభజన చట్టంపై మాట్లాడుతున్నారా అంటే అదీ లేదు.
దీంతో కేంద్రం అన్నీ చూస్తూ ఏమీ ఇవ్వక మీనమేషాలు లెక్క పెడుతోంది. ఓ విధంగా ఆంధ్రావనికి చేస్తున్నదేదీ లేకపోయినా ఏదో చేస్తున్నామని మాత్రం పైకి చెబుతోంది. రాజధాని విషయమై ఇప్పటికే ఓ సందేహాస్పద నిర్ణయంతో జగన్ ఉండడం, మూడు రాజధానుల పై ఇప్పటికీ ఏ స్పష్టతా లేకపోవడంతో అసలు ఈ ప్రాజెక్టు ముందుకు పోతుందా లేదా అన్న సందేహాలు వెన్నాడుతూనే ఉన్నాయి. వాస్తవానికి తెలుగుదేశం హయాంలో రాజధాని అమరావతి అని ఒప్పుకుని తరువాత మాట మార్చిన ఘనత కూడా ఓ విధంగా వైసీపీదేనని పసుపు పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.
ఇక వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధుల కేటాయింపుపై కూడా కేంద్రాన్నినిలదీయలేకపోతున్నారు మన రాష్ట్ర ఎంపీలు. దీంతో రాయలసీమతో సహా ఉత్తరాంధ్ర కూడా పూర్తి స్థాయిలో వెనుకబడి పోతోంది. పనుల్లేక వలసలు ఈ ప్రాంతాల నుంచి వేరే ప్రాంతాలకు కొనసాగుతూనే ఉన్నాయి. అంతేకాదు ప్రత్యేక హోదా పై పోరు గురించి ఎప్పుడో చేతులెత్తేశారు. ఈ నేపథ్యంలో ఆంధ్రావనిని కేంద్రం ఎలా ఆదుకుంటుంది. కేంద్ర ప్రాయోజిత పథకాలలో మనకు ఎలా న్యాయపరమైన వాటా దక్కుతుంది?