నెల్లూరోడు : మంత్రి గూటిలో మేయర్ పదవి?

RATNA KISHORE
నెల్లూరు మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ప‌ద‌వి ఓ ఎస్టీ మ‌హిళ‌కు ఖ‌రారైంది. ఇక్క‌డ వైసీపీ హ‌వా బాగానే ఉంది. జ‌గ‌న్ కూడా ఆశించిన విధంగానే ఇక్క‌డ ఫ‌లితాలు ఉన్నాయ‌న్న సంతృప్త‌త‌లో ఉన్నాడు. ఈ  నేప‌థ్యంలో సామాజిక న్యాయ సూత్రాలు వ‌ల్లెవేసే వైసీపీ ఈ సారి కూడా అలానే చెప్పి, ఓ ఎస్టీ మ‌హిళ అయిన దేవ‌ర‌కొండ సుజాత (53వ డివిజ‌న్ అభ్య‌ర్థి)కు ప‌ద‌వి ఖాయం అని చెప్పింది అధిష్టానం. పేరుకే ఆమెకు ప‌ద‌వి కానీ అధికారం అంతా ఉండేది, అధికారుల‌ను త‌నకు అనుగుణంగా వాడుకునేది మంత్రి అనీల్ కుమార్ యాద‌వ్ అని వేరే చెప్ప‌క్క‌ర్లేదు. జ‌గ‌న్ విధేయుడిగా పేరున్న అనీల్ కుమార్ యాద‌వ్ అనూహ్యంగా రాజ‌కీయ తెర‌పైకి వ‌చ్చి నెల్లూరు రెడ్ల‌కు కూడా చెక్ చెప్పేంత స్థాయికి వచ్చాడ‌న్నది ఓ టాక్. 



ఇదే క్ర‌మంలో ఇక్క‌డ ఉన్న రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి  శ్రీ‌ధ‌ర్ రెడ్డి విప‌క్షంలో ఉన్న‌ప్పుడు త‌న‌దైన త‌ర‌హా  నిర‌స‌న‌లు చేశారు. మురికి కాలువ‌లో నిల్చొని మ‌రీ! స‌మ‌స్య‌ల‌పై పోరు చేశారు. మంచి పేరు తెచ్చుకున్నారు. ఈయ‌న పోరుకు అప్ప‌ట్లో మంచి టాక్ వ‌చ్చింది. కానీ అధికారం అంద‌గానే ఆయ‌న చాలా మందికి అంద‌కుండా పోయారు. ఇదే స‌మ‌యంలో రెడ్డి సామాజిక‌వ‌ర్గంకు చెందిన సీఎం చుట్టూ కీల‌కంగా మారారు యాద‌వులు. దీంతో యాద‌వ సామాజిక‌వ‌ర్గాన్ని త‌న‌కు అనుగుణంగా మ‌లుచుకుని ప్రోత్సాహం అందించారు సీఎం జ‌గ‌న్. దీంతో కొన్ని సార్లు అనుచిత వ్యాఖ్య‌లు చేసినప్ప‌టికీ మంత్రి అనీల్ అంటే జ‌గ‌న్ కు అభిమాన‌మే అన్న‌ది చాలా సంద‌ర్భాల్లో నిరూప‌ణ అయింది. సో.. కోటంరెడ్డి క‌న్నా అనీల్ యాదవ్ అన్న నాయ‌కుడే జ‌గ‌న్ కు ఆప్తుడ‌య్యాడు. జ‌గ‌న్ ఏం చెబితే అది చేసేందుకు తాను సిద్ధ‌మేనని చెప్పారు.

ఇక నెల్లూరు అభివృద్ధి గురించి అనీల్ యాద‌వ్ అప్ప‌టి మంత్రి నారాయ‌ణ క‌న్నా ఎక్కువే ప‌నిచేస్తున్న‌ప్ప‌టికీ నిధుల లేమి అన్న‌ది ఒక‌టి, 2020లో పాల‌క‌వ‌ర్గం ముగిసిన‌ప్ప‌టికీ కోర్టు త‌గాదాల కార‌ణంగా ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ ఆల‌స్యం కావ‌డంతో కొత్త మేయ‌ర్ రాక ఆల‌స్యం కావ‌డంతో తాను అనుకున్న ప‌నులు కొన్ని చేయ‌లేక‌పోయారు. 150 కోట్ల రూపాయ‌ల మేర‌కు వార్షిక బ‌డ్జెట్ ను ప్ర‌వేశ పెట్టి, అందుకు అనుగుణంగా ప్ర‌ణాళిక‌లు రూపొందింప‌జేసి, అమ‌లు చేయ‌గ‌ల స‌త్తా అనీల్ కు ఉంది. క‌నుక పాల‌క‌వ‌ర్గం వ‌స్తే అనీల్ త‌న స‌త్తా చూపిస్తారు అని వైసీపీ ధీమాగా చెబుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: