కుప్పం ఫలితం తేడా కొడితే చంద్రబాబు పరిస్థితి ఏంటి..?

Deekshitha Reddy
చంద్రగిరి నుంచి తొలిసారిగా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన చంద్రబాబు ఆ తర్వాత అదే స్థానంలో టీడీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. 1989 నుంచి ఆయన తన నియోజకవర్గాన్ని కుప్పం కి మార్చారు. అప్పటినుంచి ఇప్పటి వరకు కుప్పం నియోజకవర్గంలో తిరుగు లేకుండా వరుసగా విజయాలు సాధిస్తూ వచ్చారు చంద్రబాబు. కానీ 2019లో కుప్పంలో చంద్రబాబుకి ఎప్పుడూ లేనంత తక్కువ మెజార్టీ వచ్చింది. కేవలం 30,722 ఓట్ల తేడాతో ఆయన ఒడ్డునపడ్డారు. అప్పటినుంచి వైసీపీ కుప్పంపై ఫోకస్ పెంచింది.

కుప్పంలో చంద్రబాబుని పూర్తిగా బలహీన పరిచేందుకు వైసీపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు ఏమీ చేయలేదని విమర్శిస్తూనే, వైసీపీ హయాంలో అభివృద్ధి పనులు మొదలు పెట్టింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వయంగా కుప్పం వ్యవహారాలు పర్యవేక్షిస్తూ స్థానిక నేతలను ప్రోత్సహిస్తున్నారు. ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా కుప్పంలో టీడీపీకి వ్యతిరేక పవనాలు వీచాయి. అదే ట్రెండ్ కొనసాగితే కుప్పం మున్సిపాల్టీ కూడా వైసీపీ పరం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. కానీ చంద్రబాబు మాత్రం కుప్పం మున్సిపాల్టీని ఎట్టి పరిస్థితుల్లో చేజారకుండా ఉండాలని నాయకులకు ఆదేశాలిచ్చారు. తానే స్వయంగా రెండు సార్లు కుప్పంలో పర్యటించి వచ్చారు. ప్రస్తుతం ఇద్దరు మాజీ మంత్రుల్ని అక్కడ మోహరించారు.

కుప్పం మున్సిపాల్టీలో 14వ వార్డు విషయంలో ఇప్పటికే ఓసారి పెద్ద గొడవ జరిగింది. టీడీపీ నేతల్ని పోలీసులు అరెస్ట్ చేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అప్పుడే టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. ఎలాగైనా కుప్పంని నిలుపుకోవాలని టీడీపీ, కుప్పంలో పాగా వేసి, చంద్రబాబుకి పొగపెట్టాలని వైసీపీ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.

చంద్రబాబుని కుప్పం నుంచి పంపించేస్తామని వైసీపీ నేతలు సవాళ్లు విసురుతున్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ అక్కడ బలపడుతుందని, కుప్పంలో చంద్రబాబు పోటీ చేయడానికి వెనకడుగు వేసేలా చేస్తామని అంటున్నారు. మొత్తమ్మీద కుప్పంలో ఏదైనా తేడా కొడితే చంద్రబాబు వచ్చే ఎన్నికలనాటికి మరో అనువైన నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుంటారేమో వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: