అనంత వాక్యం : కాలేజీలో పోలీసులు ఎందుకురా?
నిన్నటి గొడవ ఇది. ఓ ఆడపిల్ల తల పగిలింది. అయినా అదేమంత పెద్ద తప్పు కాదు దెబ్బా కాదు. విద్యార్థి సంఘాలు అక్కడికి రాకూడదు. వైసీపీ విద్యార్థి సంఘం మాత్రం సంఘటన గురించి చెప్పాలి అది మనం వినాలి. పోలీసులు వచ్చి విద్యార్థులను ఈడ్చి ఈడ్చి కొట్టాలి. అలా కొడితేనే లా అండ్ ఆర్డర్ సక్రమంగా అమలు అయిందని అనుకోవాలి. లేదంటే లేదు.
అనంతపురంలో విద్యార్థులది తప్పా లేదా కళాశాల యాజమాన్యాలది తప్పా అన్నది ఇప్పుడిక తేలాలి. ఎయిడెడ్ విద్యా సంస్థలపై కొరడా ఝళిపిస్తున్న జగన్ సర్కారుకు సమస్యను పరిష్కరించడం తెలియకే పోలీసుల సాయం తీసుకుంటుందా? అసలు కాలేజీలో పోలీసులు ఎందుకు అంతగా శాంతి భద్రతలు ఏమయినా అదుపు తప్పుతాయా? విద్యార్థుల డిమాండ్లు తీర్చలేని స్థితిలో జగన్ ప్రభుత్వం ఉందా? ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులపై పోలీసులు జులుం చేయాలని ఆదేశాలు ఏమయినా ఇచ్చిందా..? ఎందుకని ఇలాచేస్తున్నావు జగన్ !
పోలీసులు, పౌరులు సఖ్యంగా ఉంటేనే మంచి సమాజం నిర్మాణం సాధ్యం. పోలీసులు, ప్రజలూ ఎవరిని వారు విడదీసుకోకుండా కలిసి ఉండి సామాజిక సమస్యలపై పనిచేస్తే ఇంకా ఆశించిన ఫలితాలు రావడం కూడా తథ్యం. పోలీసులు దారి పోలీసులదే అన్న విధంగా ఉంటే, ప్రజల దారి ప్రజలదే అన్న విధంగా ఉంటే అప్పుడు వ్యవస్థ ఎలా గాడిన పడుతుంది. అనంతపురంలో ఎస్ఎస్బీఎన్
కళాశాలలో నిన్నటి వేళ జరిగిన ఘటన ఎంతో విచారకరంగా ఉంది. ఆ కళాశాలలో వివాదం ఉన్నప్పటికీ పోలీసులు వాటిని శాంతింపజేయాలే కానీ విద్యార్థులను ఇష్టమొచ్చినట్లు బాదడం సబబు కాదు. ఇదెంత మాత్రం ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే పని కాదు. ఆ కళాశాల ఎయిడెడ్ కళాశాల. అక్కడే డిగ్రీ , పీజీ కోర్సులు కూడా నడుస్తున్నాయి. అయితే దీనిని ప్రయివేటీకరిం చాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఎయిడెడ్ కళాశాలగా ఇకపై ఉంచకూడదని అనుకుంటోంది. దీంతో తాము ఫీజులు చెల్లించుకోలేమని కళాశాలను ప్రయివేటీకరణ చేయవద్దని విద్యార్థులు రోడ్డెక్కారు. ఇందుకు ఏఐఎస్ఎఫ్,ఎస్ఎఫ్ఐ కూడా మద్దతుగా నిలిచాయి. అయితే కళాశాల గేటు మూసి ఆందోళన చేస్తున్న విద్యార్థులను చెదరగొట్టాల్సిన పనేముంది. కాలర్ పట్టుకుని ఈడ్చుకుపోవాల్సిన పని ఏముంది. ఆడపిల్లలపై చేయి చేసుకోవడం ఏంటి? అసలు మహిళా కానిస్టేబుళ్లే లేరా?ఏం చేస్తున్నారని?