మోడీ వింటున్నారా.. తెగేసి చెప్పిన తెలుగు సీఎంలు..?

Chakravarthi Kalyan
నరేంద్ర మోడీ.. వింటున్నారా.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏమంటున్నారో వింటున్నారా.. మొన్నటికి మొన్న కేంద్రం కాస్త పెట్రో ఉత్పత్తులపై పన్నులు తగ్గించింది. దీని వల్ల పెట్రోల్ లీటర్‌ మీద ఐదు రూపాయలు.. డీజీల్ లీటర్‌ మీద పది రూపాయలు ధర తగ్గింది. అయితే.. తాము తగ్గించడమే కాకుండా.. ఓ రాష్ట్రాలూ.. మీరు కూడా కాస్త తగ్గించండయా అంటూ ఉచిత సలహా ఒకటి పారేసింది కేంద్రం.. అయితే.. చెప్పింది మోడీ సర్కారు కదా.. అందుకే బీజేపీ పాలిత రాష్ట్రాలు కేంద్రం సూచనలను తూచ తప్పకుండా పాటించాయి.


అయితే.. బీజేపీయేతర రాష్ట్రాల మాత్రం తమ పన్నులు తగ్గించలేదు. ఒక్క ఒడిశా మాత్రమే పన్ను తగ్గించిన బీజేపీయేతర రాష్ట్రంగా ఉంది. అయితే.. మిగిలిన రాష్ట్రాలు సైలంట్‌గా ఉండిపోయాయి. అయితే.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల సీఎంలు మాత్రం కేంద్రంపై ఈ విషయంలో దండయాత్రకే సిద్ధమయ్యాయి. ఏపీ సీఎం జగన్ ఏకంగా పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటన ఇచ్చేశారు. కొండంత పెంచేసి.. గోరంత తగ్గించేసి.. రచ్చ రచ్చ చేస్తారా అంటూ బీజేపీ, టీడీపీలపై విమర్శలు చేశారు. ఇదంతా రాజకీయ లబ్ది కోసం చేస్తున్న ప్రయత్నంగానే ఏపీ సీఎం జగన్ ప్రకటన ఉంది.


ఇక మరో తెలుగు సీఎం కేసీఆర్‌ ఏకంగా కేంద్రంపై యుద్ధమే ప్రకటించేశారు. అసలే హుజూరాబాద్ ఉపఎన్నికలో ఓడిపోయిన కాక మీద ఉన్న కేసీఆర్.. వరి పంట కొనుగోలు వివాదం విషయం కారణంగా ప్రెస్ మీట్ పెట్టారు. ఆ తర్వాత అన్ని విషయాలూ ప్రస్తావించారు. ప్రత్యేకించి పెట్రో ధరల విషయంలో కేంద్రం అద్భుతంగా అబద్దాలు ఆడుతోందని మండిపడ్డారు. పెట్రో ధరల పన్నులను సెస్సు రూపంలో కలిపేసి రాష్ట్రాలకు వాటా రాకుండా కేంద్రం కుట్ర చేసిందని.. సీఎం కేసీఆర్ మండిపడ్డారు.


పెట్రో ధరలను ఏడేళ్లుగా విచ్చలవిడిగా పెంచుతూ వచ్చిన కేంద్రం  కొండంత పెంచి.. గోరంత మాత్రమే తగ్గించే ఏదో ఉద్దరించినట్టు మాట్లాడుతోందని కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్రో పన్నులు ఏమాత్రం పెంచలేదని.. కేంద్రమే ఇన్నాళ్లూ సొమ్ము చేసుకుందని విమర్శించారు. మొత్తం మీద పెట్రో పన్నుల విషయంలో రెండు రాష్ట్రాల తెలుగు సీఎం కేంద్రంపై యుద్ధం ప్రకటించేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: