కేసీఆర్‌కు దమ్ముంటే నాతో పాదయాత్ర చేయాలి : షర్మిల
తెలంగాణ సీఎం కేసీఆర్ నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇచ్చి అమలు చేయకుండా మోసం చేస్తున్నారని టీ వైఎస్సార్ పార్టీ అధ్యక్షురాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఫామ్ హౌస్ కోసమే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టావా..? రైతులకు నీళ్లు ఇవ్వడానికి నిర్మించావా...? అని ప్రశ్నించారు షర్మిల. పత్తి కొనుగోలు కేంద్రాలు నెలకొల్పడంలో ప్రభుత్వం ఎందుకు ముందడుగు వేయడం లేదో కేసీఆర్ సమాధానం చెప్పాలి. డిగ్రీలు, పీజీలు చదివిన నిరుద్యోగులు హమాలీ కూలీలుగా మారుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు షర్మిల. నల్లగొండ జిల్లాలో ప్లోరైడ్ సమస్యను పూర్తిగా నిర్మూలించాలని వైఎస్సార్ కలలు కన్నారు. ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేశారు. ఆయన బ్రతికి ఉంటే ప్రతీ ప్రాజెక్ట్ పూర్తయి ఉండేది.
కేసీఆర్, కేటీఆర్ తండ్రి కొడుకులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు అని దుయ్యబట్టారు షర్మిల. రాష్ట్రంలో లిక్కర్ మాఫియా రోజు రోజుకు పెరిగిపోతుందని.. దీంతో మహిళలపై అఘాయిత్యాలు ఎక్కువయ్యాయని పేర్కొన్నారు. తెలంగాణలో అసలు సమస్యలు లేవని పేర్కొంటున్న కేసీఆర్ దమ్ముంటే నాతో పాదయాత్ర చేయాలని షర్మిల సవాల్ విసిరారు. ప్రజల సంక్షేమం కోసమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ పుట్టినదని, రాజన్న బిడ్డగా తనను ఆశీర్వదించాలని కోరారు షర్మిల. ప్రాజెక్టుల పేరుతో రైతుల వద్ద భూములు తీసుకుని, రైతులకు ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తుందని షర్మిల ధ్వజమెత్తారు.